బాలీవుడ్ లో కలకలం.. సైఫ్ పై దాడి
Confusion in Bollywood.. Attack on Saif
ఆరుచోట్ల కత్తిపోట్లు
రెండుచోట్ల లోతైన గాయాలు
సర్జరీ చేసిన వైద్యులు
తప్పిన ప్రాణాపాయం
దాడిని ఖండించిన సినీ ప్రముఖులు
వివిధ కోణాల్లో ముంబాయి పోలీసుల విచారణ
ముంబాయి: ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి బాలీవుడ్ లో కలకలం రేకెత్తించింది. బుధవారం అర్థరాత్రి ముంబాయి బాంద్రాలోని ఆయన నివాసంలో 2 గంటల సమయంలో ఏదో అలికిడి కాగా సైఫ్ ఇంట్లోని సహాయకుడు నిద్దురలేచాడు. అతనిపై నిందితుడి దాడి చేసి తప్పించుకునే క్రమంలో సైఫ్ కూడా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో నిందితుడు ఒక్కసారిగా సైఫ్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో సైఫ్ అలీఖాన్ కు ఆరుచోట్ల కత్తిపోట్ల గాయాలయ్యాయి. మెడ, వెన్నెముక ప్రాంతాల్లో లోతైన గాయాలయ్యాయి. దాడిచేసిన వెంటనే నిందితుడు పరారయ్యాడు. ఈ దాడిలో ఇంట్లో పనిచేస్తున్న ఓ సహాకుడికి కూడా గాయాలయ్యాయి. వెంటనే సైఫ్ ను ముంబాయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సైఫ్ కు చికిత్స అందజేశారు. గురువారం వెన్నెముక ప్రాంతంలో న్యూరోసర్జన్లు డాక్టర్ నితిన్ డాంగే, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్ నేతృత్వంలో వైద్యుల బృందం ఆయనకు ఆపరేషన్ చేసి ఓ ఇనుపముక్క (కత్తి)ని తీసివేశారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయన్ను అబ్జర్వేషన్ లో ఉంచినట్లు ఆసుపత్రి సీఓఓ నీరజ్ తెలిపారు.
ఈ దాడితో ఒక్కసారిగా బాలీవుడ్ లో తీవ్ర కలకలం సృష్టించింది. పలువురు సైఫ్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. వెంటనే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ర్ట ప్రభుత్వం, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున సైఫ్ ఇంటివద్ద, ఆసుపత్రి వద్ద భద్రతను పటిష్టం చేశారు. ప్రత్యేక బృందాలు ఆయన ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. వాచ్ మెన్లు, ఇంటి పనిమనుషులను విచారిస్తున్నారు. ఇంత భద్రత ఉన్నా నిందితుడు ఇంటిలోని ఏడో అంతస్థులకు ఎలా చేరుకున్నాడు, ఎప్పుడు చేరుకున్నాడనే విషయంపై అన్ని కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు.
బాలీవుడ్ ప్రముఖులపై దాడుల బెదిరింపులు, ఇళ్లపై దాడులతో ఇప్పటికే భయాందోళనలు సృష్టిస్తుండగా సైఫ్ పై తాజా దాడితో ప్రముఖుల భద్రతపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.