బలమైన నౌకాదళానికే తమ ప్రాధాన్యం
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ముంబాయి: హిందూ మహాసముద్రంలో బలమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేయాలనేదే తమ తొలి ప్రాధాన్యమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. బుధవారం ముంబాయిలోని నేవల్ డాక్ లో ప్రధానమంత్రి మూడు యుద్ధ నౌకలను ప్రారంభించిన కార్యక్రమంలో రక్షణ శాఖమంత్రి పాల్గొని ప్రసంగించారు. జాతీయ భద్రత, దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. 2025లో సాయుధ దళాలను మరింత ఆధునీకరించి, రక్షణ సంస్కరణలు మరింత పటిష్ఠం చేస్తామని వివరించారు. ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లను నావికాదళాన్ని మరింత బలోపేతం చేశాయని, దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశం శక్తికి నిదర్శనంగా నిలవనుంని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ప్రపంచ పరిణామాల నేపథ్యంలో హిందూ మహాసముద్ర ప్రాంతం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. ఈ ప్రాంతంలో చేపలు పట్టడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటి కార్యకలాపాల కారణంగా అంతర్జాతీయ శక్తి డైనమిక్స్, భద్రతా సమస్యలకు కేంద్రంగా మారుతుండడాన్ని నివారించే చర్యలను మరింత పటిష్ఠంగా భారత్ చేపడుతుందన్నారు. ఈ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశ భౌగోళిక, ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నారు. రెండువేల సంవత్సరాల క్రితమే రోమ్, ఆగ్నేయాసియా దేశాలతో ప్రారంభమై వ్యాపార, వాణిజ్యాలు నేడు 95 శాతానికి పైగా సముద్ర మార్గం ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి కీలక సమయంలో సముద్ర భద్రతతో ప్రయోజనాలు చేకూరుస్తాయని స్పష్టం చేశారు. దీంతో హిందూ మహాసముద్రంలో బలమైన ఉనికిని కూడా భారత్ చాటనుందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. తక్కువ సమయంలో పూర్తి దేశీయంగానే ఆయుధాలు, యుద్ధ నౌకల తయారీకి కట్టుబడి ఉన్నామని వివరించారు. తమ ప్రయత్నాలను ముందుకు తీసుకువెళతామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.