పెట్రోల్, డిజీల్ వాహనాల నిషేధంపై కమిటీ!
Committee on the ban of petrol and diesel vehicles!
ముంబాయి: మహారాష్ట్రలో పెట్రోల్, డిజీల్ వాహనాల నిషేధానికి సన్నాహాలను ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి మూడు నెలల్లోగా నివేదికను సమర్పించాలని కోరింది. జనవరి 22న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుధీర్ శ్రీ వాస్తవ కమిటీకి నాయకత్వం వహిస్తారని మంగళవారం ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కమిటీలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఎండీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రెసిడెంట్, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సభ్యులుగా ఉండనున్నారు. ఉత్తర్వుల ప్రకారం వివిధ రంగ నిపుణులను కూడా చేర్చనున్నారు. ముంబాయి మెట్రోపాలిటిన్ లో థానే, రాయ్ ఘర్, పాల్ఘర్ జిల్లాలు కూడా వస్తాయి. ఈ ప్రాంతాల్లో కూడా పెట్రోల్, డిజీల్ వాహనాల నిషేధంపై అధ్యయనం జరగనుంది. నగరంలోని కలప, బొగ్గును ఉపయోగించే బేకరీలు కూడా ఆరు నెలల్లోకా గ్యాస్ లేదా ఇతర గ్రీన్ ఇంధనాలకు మారాలని బీఎంసీ, ఎంపీసీబీని కోర్టు ఆదేశించింది. ఇకపై కొత్త వ్యాపారాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వబోమని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు ముంబాయి ప్రభుత్వ యంత్రాంగం కమిటీని ఏర్పాటు చేసింది. అత్యంత కాలుష్య నగరాల్లో ముంబాయి 512వ స్థానంలో నిలిచింది. ముంబాయి ఎక్యూఐ 193 అత్యధికంగా నమోదవుతుంది. ఈ ప్రాంతంలో రోజు 35 లక్షల నుంచి 48 లక్షలకు పైగా వాహనాలు తిరుగుతుంటాయి. వీటిలో 14 లక్షలు కార్లు, 29 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ప్రతీ కిలోమీటర్ కు సగటున 2300 వాహనాలు ప్రయాణిస్తుంటాయి.