ఢిల్లీ బీజేపీ మేనిఫెస్టో విడుదల
Delhi BJP manifesto released
ప్రతీ మహిళకు రూ. 2500
రూ. 500 సబ్సిడీకే గ్యాస్ సిలిండర్
హోలి, దీపావళికి ఫ్రీ
వృద్ధుల పెన్షన్ రూ. 500 పెంపు
గర్భిణులకు రూ. 21వేలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టోలో అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుంది. శుక్రవారం కేంద్రమంత్రి జేపీ నడ్డా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను మీడియా సమక్షంలో విడుదల చేశారు. ఎల్పీజీ సబ్సిడీ రూ. 500, హోలీ, దీపావళికి ఒక సిలీండర్ ఉచితం, మహిళలకు ప్రతి నెలా రూ. 2500ను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ ప్రభుత్వ పథకాలు ఆపబోమని జేపీ నడ్డా అన్నారు. వాటిని కొనసాగిస్తూనే అవినీతిని పెకిలించివేస్తామన్నారు. గర్భిణులకు రూ. 21వేలు అందజేస్తామన్నారు. 60–70ఏళ్ల మధ్య వయోవృద్ధుల పెన్షన్ ను రూ. 2000 నుంచి రూ. 2500కు పెంచుతామన్నారు. వితంతువులు, వికలాంగులకు రూ. 3,500 పెన్షన్ అందజేస్తామన్నారు. అదే సమయంలో ఆయుష్మాన్ భవ్ పథకం కింద రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తామన్నారు. ఈ పథకం కింద 51 లక్షల మంది లబ్ధిదారులకు మేలు చేకూరనుంది.
ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడారు. ఆప్ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను మోసం చేస్తూనే ఉందన్నారు. కరోనా కష్టకాలంలో 80వేల మంది వృద్ధులు సరైన చికిత్స అందక మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి స్థానంలో కొత్తవారి పేర్లను కూడా పెన్షన్ జాబితాలో చేర్చలేదన్నారు. పూర్వాంచల్ ప్రజల పట్ల విపత్తు సమయంలో అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. చెప్పింది చెప్పినట్లుగా చేసేదే మోదీ ట్రాక్ రికార్డ్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో తీసుకునే నిర్ణయాలకు పూర్తి గ్యారంటీ ఉంటుందని, ఆప్, కూటమి పార్టీల్లాగా మభ్యపెట్టేది ఉండదని విమర్శించారు. పేదల సంక్షేమం, సుపరిపాలన, మహిళల గౌరవం, అభివృద్ధి, యువత, రైతుల సాధికారత, శ్రామిక వర్గాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని, ఈ రోజు నీతి ఆయోగ్ ప్రకారం 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకువచ్చామని సంతోషం వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటు కాబోతుందని అవినీతి నేతల భరతం పడతామని జేపీ నడ్డా స్పష్టం చేశారు.