అమెరికాలో విమానం, హెలికాప్టర్ ఢీ 18 మంది మృతదేహాలు లభ్యం
18 dead bodies found in plane and helicopter crashes in America
కొనసాగుతున్న రెస్క్యూ చర్యలు
పోటోమాక్ నదిలో పడ్డ విమానాలు
డోనాల్డ్ ట్రంప్ విచారం
1982లో కూడా ఇదే తరహా ఘటనలో 78 మంది మృతి
వాషింగ్టన్ డీసీ: అమెరికా వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక విమానం, హెలికాప్టర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. రెండు విమానాలు పోటోమాక్ నదిలో పడిపోయాయి. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెస్క్యూ చర్యల్లో గురువారం ఉదయం వరకూ 18 మంది మృతదేహాలను బయటికి తీశారు. యూఎస్ ఎయిర్ లైన్స్ కు చెందిన సీఆర్ జె 700 బొంబార్డియర్ జెట్, ఆర్మీకి చెందిన బ్లాక్ హాక్ (హెచ్ 60) హెలికాప్టర్ ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ లో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా, విమానంలో నలుగురు సిబ్బంది సహా 64 మంది ప్రయాణిస్తున్నారు. బొంబార్డియర్ జెట్ కాన్సాస్ నుంచి వాషింగ్టన్ కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సైనిక హెలికాప్టర్ బ్లాక్ హాక్ శిక్షణ విమానమని అధికారులు వివరించారు. విమాన శకలాలు పోటోమాక్ నదిలో ఉన్నాయి. రెస్క్యూ చర్యల్లో యూఎస్ పార్క్ పోలీస్, డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్, యూఎస్ ఆర్మీతో సహా పలు ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. ఘటనా స్థలంలో ఫైర్ బోట్లను కూడా భారీ ఎత్తున మోహరించారు.
ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయని, అంతవరకు రీగన్ ఎయిర్ పోర్ట్ లో విమాన రాకపోకలు రద్దు చేశామని యూఎస్ హోం సెక్రెటరీ తెలిపారు.
1982 జనవరి 13న కూడా పోటోమాక్ లో ఎయిర్ ఫ్లోరిడా విమానం కూలిపోయిన ఘటనలో 78మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆనాటి ప్రమాదమే గుర్తుకు వస్తుందని పలువురు సీరియర్ అధికారులు వివరించారు.