మహా అఘాడిలో సీట్ల పంపిణీ కొలిక్కి
అసంతృప్తిలో ఆశావహులు
ముంబాయి: మహావికాస్ అఘాడిలో కూడా సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది. ఢిల్లీ, ముంబాయిలో అర్థరాత్రి వరకు కొనసాగిన సమావేశాలతో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) వర్గం ఏకాభిప్రాయానికి వచ్చారు. కాంగ్రెస్ 105 నుంచి 110 స్థానాల్లో పోటీ చేయనుండగా, శివసేన (యూబిటీ–ఉద్ధవ్) 90 నుంచి 95 స్థానాల్లో, ఎన్సీపీ (శరద్) 75 నుంచి 80 స్థానాల్లో పోటీ చేయనున్నారు. అయితే విదర్భ, కొంకణ్, మరాఠ్వాడా, ఉత్తర, పశ్చిమ మహారాష్ర్టల్లోని పలు స్థానాల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలనుకున్న అభ్యర్థులకు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే కూడా ఆయా స్థానాలలో పేచీ నెలకొందన్నారు. తమ పార్టీ నుంచి గెలిచే అభ్యర్థులు ఉన్నారన్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలోని స్థానాలు సీట్ల సర్దుబాటులో శివసేన (యూబిటీ–ఉద్ధవ్) వర్గానికి దక్కడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. దీంతో మహా వికాస్ అఘాడికి నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లోని పలువురు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.