‘హెచ్ఎంపీవీ’పై చైనా బుకాయింపు!
China booked on 'HMPV'!
ఆసుపత్రుల్లో బెడ్లు లేక రోడ్లపైనే టెస్టులు
ఆరోగ్య మంత్రిత్వ శాఖ భిన్న ప్రకటనలు
గప్ చిప్.. జిన్ పింగ్ ఆదేశాలు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: చైనా మరోమారు హెచ్ ఎంపీవీ వైరస్ తమదేశంపై అంతగా ప్రభావం చూపించడం లేదని బూకాయిస్తోందా? అసలు ఆ దేశంలో అడుగడుగునా ఈ కేసులు రోజుకు లక్షల్లో నమోదవుతున్నాయా? ఆసుపత్రుల్లోనూ రోగులకు చోటు దొరక్క ఏకంగా రోడ్లపైనే టెస్టులు చేస్తుందా? ఏ విషయాలను బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావంపై బహిరంగంగా ప్రకటించారు. ఈ మంత్రిపై కూడా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఈ వైరస్ పై బహిరంగ వ్యాఖ్యలపై నిషేధం విధించినట్లు సమాచారం. దీంతో మరోమారు ఆరోగ్య శాఖ ద్వారా పరిస్థితులు అదుపులో ఉన్నట్లు ప్రకటన విడుదల చేశారు. దీన్నిబట్టి చూస్తే ఆ మంత్రిపై అధ్యక్షుడి ఒత్తిడి స్పష్టమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
గతంలోనూ..
2019, డిసెంబర్ 31న వుహాన్‌లో న్యుమోనియా వంటి వ్యాధి వ్యాపిస్తోందని చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపింది. ఈ వ్యాధి కరోనా వైరస్ వల్ల వచ్చింది. అయితే చైనా మనకు చెప్పే ఒకటిన్నర నెలల ముందే కరోనా వైరస్ వ్యాపించింది.
2020 మార్చి 13 సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక నివేదికను ప్రచురించింది. ఇందులో, ప్రభుత్వ పత్రాలను ఉటంకిస్తూ హుబే ప్రావిన్స్‌లో మొదటి కరోనా రోగి 2019లో గుర్తించినట్లు ఖచ్చితమైన సమాచారం ప్రసారం చేశారు. అటు పిమ్మట 266 కరోనా రోగులను గుర్తించినట్లు పేర్కొన్నారు.
2021 మే అమెరికన్ వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంటెలిజెన్స్ నివేదికను ఉటంకిస్తూ 2019 నవంబర్ లోనే, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ముగ్గురు పరిశోధకులు అనారోగ్యానికి గురయ్యారని, ఆసుపత్రి నుంచి సహాయం కోరారని పేర్కొన్నారు. అయితే చైనా మాత్రం కరోనా కేసులే లేవని ప్రపంచం చెవిలో పువ్వులు పెట్టేందుకు ప్రయత్నించింది. అనంతరం డబ్ల్యూహెచ్ వో పరిశోధనలో చైనా చెబుతున్నవన్నీ అసత్యాలేనని తేలింది. అంతేకాదు కరోనా గురించి తొలుత ప్రపంచానికి చెప్పిన చైనా వైద్యుడు లీ వెన్లియాంగ్ పై కఠిన వైఖరిని అవలంభించింది. ఆ తరువాతి పరిణామాల్లో అతను కరోనాకు గురై మృతిచెందాడు. ఇతని మృతిపై కూడా పలు అనుమానాలున్నాయి. చైనా నిర్లక్ష్యం, అసత్యాలు, స్వంత దేశ ప్రయోజనాల కోసం ఇతర దేశాల ప్రజల ప్రాణాలతో చెలగాటం వంటి జుగుప్సాకరమైన నిర్ణయాలు, అసత్యాలతో కాలం వెళ్లబుచ్చుతూ ప్రపంచాన్ని ఆందోళనలో, ప్రమాదంలో పడవేసింది.
దీంతో ప్రస్తుతం వ్యాపిస్తున్న హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలోనూ చైనా చెబుతున్నవన్నీ అసత్యాలేననే వార్తలు రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం చైనాలో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.