మద్రాస్ కోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
ఎస్సీ ధృవపత్రం జారీ పిటిషన్ పై విచారణ
మత మారితే గుర్తింపు రద్దవుతుంది
తప్పుడు పత్రాల సమర్పణతో రిజర్వేషన్ లక్ష్యాలను దెబ్బతీస్తుంది
నా తెలంగాణ, న్యూఢిల్లీ: రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని తప్పుదోవపట్టించడమేనని, మోసగించడమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇతర మతంలో కొనసాగుతూ ఉద్యోగం కోసం ఎస్సీ ధృవపత్రం జారీ చేయాలన్న పిటిషన్ పై సుప్రీం బుధవారం విచారణ చేపట్టింది. జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మద్రాసు హైకోర్టు 2023లో ఇచ్చిన తీర్పును సమర్థించింది . గతంలో ఇదే పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. మద్రాస్ కోర్టు తీర్పు సరైందేనని సుప్రీం స్పష్టం చేసింది.
క్రైస్తవ మతానికి, హిందూ మతానికి భిన్నంగా కుల భేదాలు లేవని కోర్టు ఎత్తిచూపింది. అందువల్ల, ఒక వ్యక్తి హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారినప్పుడు, ఆ వ్యక్తి కుల గుర్తింపు రద్దవుతుందని తెలిపింది. వ్యవస్థను దుర్వినియోగం చేయడం సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన రిజర్వేషన్ విధానాల లక్ష్యాలను దెబ్బతీస్తుంది. ఈ పిటిషన్ పై సీనియర్ న్యాయవాది ఎన్‌ఎస్ నప్పినై వాదించగా, ప్రతివాదుల తరఫున న్యాయవాది అరవింద్ ఎస్ వాదించారు.
పిటిషన్ వేసిన వ్యక్తి ఎస్సీ కేటగిరి కింద పుదుచ్చేరిలో అప్పర్ డివిజన్ క్లర్క్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులో ఎస్సీగా పేర్కొన్నారు. తండ్రి హిందువుగానే ఉండగా మతం మారానని తెలిపారు. తాను హిందూ మతాన్ని స్వీకరించానన్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను మద్రాస్ కోర్టుకు సమర్పించారు. కాగా కోర్టు విచారణలో సాక్ష్యాలు సరైనవి కావని కోర్టు గుర్తించింది. చర్చి రికార్డుల్లో క్రిస్టియన్ గా ఉన్నారని ధృవీకరించారు. హిందూ మతంలోకి మారినట్లు ప్రకటన గాని, అధికారిక సాక్ష్యాలు, దాఖాలాలే లేవని గుర్తించారు. కులం ఆధారిత రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందాలంటే పిటిషనర్ దాఖలు చేసిన కులానికి, మతానికి సంబంధించిన సరైన సాక్ష్యం ఉండాలని పేర్కొన్నారు.
చివరగా సుప్రీంకోర్టు ధర్మాసనం మాట్లాడుతూ.. ఒక వ్యక్తి సూత్రాలు, సిద్ధాంతాలు, ఆధ్యాత్మిక ఆలోచనల నుంచి నిజమైన ప్రేరణ పొందినప్పుడు వేరే మతంలోకి మారతాడు. ఏదేమైనప్పటికీ, మతమార్పిడి ఉద్దేశ్యం ఎక్కువగా రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడమే అయితే, ఇతర మతంపై అసలు నమ్మకంతో కానట్లయితే, దానిని అనుమతించలేము. ఎందుకంటే అటువంటి నిగూఢ ఉద్దేశ్యాలతో ఉన్న వ్యక్తులకు ప్రయోజనాలను పొడిగించడం కేవలం సామాజిక ధర్మాన్ని మాత్రమే దెబ్బతీస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.