ఫిబ్రవరి 14న సీఎం ప్రమాణ స్వీకారం
CM will take oath on February 14

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం 14వ తేదీన జరగనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జయంత్ పాండా, బీఎల్ సంతోష్ లతో సహా పలువురు ప్రముఖులు సీఎం పదవి ఎవరికి కేటాయిస్తే బాగుంటుందనే దానిపై భేటీ నిర్వహించారు. మరోవైపు ఢిల్లీకి చెందిన ఐదుగురు బీజేపీ నాయకులు ఎల్జీ వీకే. సక్సేనాతో భేటీ అయ్యారు. భేటీ వివరాలను మాత్రం బయటకు చెప్పలేదు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాకే ప్రమాణ స్వీకారం ఉండనుందనే విషయాన్ని మాత్రం సూత్రప్రాయంగా నాయకులు అంగీకరిస్తున్నారు. సీఎం ప్రమాణ స్వీకారంలో ఎన్డీయే పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులంతా హాజరుకానున్నారు. శనివారమే మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం సీఎం ఏర్పాటుపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయా నేతల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావించి ఆదివారం భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా 70 స్థానాలున్న ఢిల్లీలో 48 స్థానాలతో 45.56 శాతం ఓట్లతో అత్యధిక మెజార్టీ సాధించిన పార్టీగా బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. నలుగురు ఎస్సీ అభ్యర్థులు, 16 మంది బీసీ, ఓబీసీల నుంచి గెలుపు సాధించిన వారిలో ఉన్నారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన హరియాణా, యూపీ ప్రజల ప్రభావం చూపే 22 స్థానాలు ఉండగా, 15 స్థానాల్లో బీజేపీ విజయఢంకా మోగించింది.