‘గుండుసున్నా’ల పార్టీ కాంగ్రెస్!
The party of 'gundusunna' is Congress!

అంతర్మథనంలో దిగ్గజ నేతలు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: కాంగ్రెస్ కు ‘గుండు సున్నా’ గండం మరింత పొంచి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే నాలుగైదు రాష్ర్టాల్లో గుండు సున్నాతో నెట్టుకొస్తున్న పార్టీ కాస్త ఢిల్లీలోనూ ‘తగ్గేదేలే’ అని నిరూపించుకున్నట్లయింది. దీంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, వేణుగోపాల్ వంటి బడా నాయకుల పనితీరు పట్లనే ఆ పార్టీలో విశ్వాసం పూర్తిగా కొరవడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదీ గాక దేశ వ్యాప్తంగా ఈ బడా నాయకులు చేస్తున్న ప్రచారాలు పూర్తిగా అసత్యాలు, అబద్ధాలు, కుటుంబ పాలన దిశగా కొనసాగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ గ్రాఫ్ దేశంలో భారీగా దిగజారిపోతుంది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, నాగాలాండ్ రాష్ర్టాల్లో పార్టీ ‘గుండుసున్నా’కే పరిమితమైంది.
ఢిల్లీలో 70 స్థానాలకు గాను ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోకుండా చతికిలపడింది. ఆంధ్రప్రదేశ్ లోని 164 స్థానాల్లో ఎన్డీయే కూటమి, 11 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2024లో జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లను సైతం కోల్పోయారు. ఇక్కడా కాంగ్రెస్ ‘గుండుసున్నా’కే పరిమితమైంది. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో టీఎంసీకి 224 మంది ఎమ్మెల్యేలుండగా, బీజేపీకి 66 మంది ఎమ్మెల్యేలున్నారు. ముర్షిదాబాద్ లోని సాగర్ డిఘి స్థానంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన అభ్యర్థి కాస్త టీఎంసీలోకి జంప్ అయ్యాడు. దీంతో ఇక్కడా ‘గుండుసున్నా’ స్థానం పదిలం చేసుకుంది. సిక్కిం 32 స్థానాలకు గాను ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ విజయం సాధించలేకపోయింది. ఇక్కడ సిక్కిం క్రాంతికారి మోర్చాతో బీజేపీ జతకట్టి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇక 60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్ లో 2023లో ఎన్నికలు జరగ్గా ఇక్కడ ఒక్కసీటును సాధించలేక కాంగ్రెస్ పార్టీ తన హస్తంలో ‘గుండుసున్నా’ను అట్టి పెట్టేసుకుంది. నాగాలాండ్ లో బీజేపీకి సొంతంగానే 12 మంది అభ్యర్థుల బలం ఉంది. ఇక అరుణాచల్, మేఘాలయ, మిజోరంలలో చావుతప్పి కన్నులొట్టపోయినట్లు ఒక్కో స్థానమైతే దక్కింది. కానీ ఆ అభ్యర్థులు కూడా రేపోమాపో ఇతర పార్టీల్లోకి మారి కాంగ్రెస్ ‘గుండుసున్నా’నే అందిస్తారనే వాదనలున్నాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా హస్తం ‘గుండుసున్నా’ల పార్టీగా నామకరణం చెందుతుందేమో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.