డీఈవో ఇంట్లో నోట్ల కట్టలు
రెండు మంచాల నిండా అక్రమ సంపాదన
పాట్నా: బిహార్ బెట్టియా జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) రజనీకాంత్ ప్రవీణ్ నివాసంపై విజిలెన్స అధికారులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా నోట్ల కట్టలు బయటపడ్డాయి. గురువారం అధికారి బసంత్ బిహార్ కాలనీ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో రెండు మంచాల నిండా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో అధికారులు అవాక్కయ్యారు. భారీ మొత్తం ఎంత ఉందనేది తేల్చేందుకు నోట్ల లెక్కింపు మిషన్లు తెప్పించి లెక్కిస్తున్నారు. మరోవైపు అధికారి ప్రవీణ్ ను విచారిస్తున్నారు. ఈ విషయంపై డీఈవో కార్యాలయ సిబ్బందిని సైతం అధికారులు విచారిస్తుండగా ఎవ్వరూ నోరు మెదపడం లేదు. ప్రవీణ్ గత మూడేళ్లుగా ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన సంబంధికులు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకోవడంతో అధికారులు పోలీసు బలగాలను భారీ ఎత్తున మోహరించాల్సి వచ్చింది.
డీఈవోపై పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ బృందం విచారించేందుకు, సోదాలు చేపట్టేందుకు ఇంటికి రాగా ఆరోపణలు వాస్తవమేననే వాదనలూ వినిపిస్తున్నాయి.