బైడెన్​ తప్పులు! ట్రంప్​ నిర్ణయాలు వెనక్కు

Biden's mistakes! Trump's decisions are behind

Jan 17, 2025 - 14:35
 0
బైడెన్​ తప్పులు! ట్రంప్​ నిర్ణయాలు వెనక్కు

బాధితులుగా మారొద్దు
ప్రజలతో చివరి ప్రసంగంలో జో బైడెన్​

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ పదవీ కాలం మరో రెండు రోజుల్లో పూర్తికానుంది. దీంతో ఆయన అమెరికన్లను ఉద్దేశిస్తూ చివరి ప్రసంగం చేశారు. తాను తీసుకున్న నిర్ణయాలు, అభిప్రాయాలను ప్రజలకు వివరించి చెప్పారు. ట్రంప్​ పార్టీని టార్గెట్​ చేశారు. అమెరికా ప్రజలు బాధితులుగా మారుతున్నారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛ కొనసాగాలన్నారు. జనవరి 20న ట్రంప్​ అధికార పగ్గాలు చేపట్టనుండడంతో జో బైడెన్​ చేసిన ఈ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే జో బైడెన్​ తన పరిపాలనా కాలంలో ట్రంప్​ ను విబేధిస్తూ ఎన్నో నిర్ణయాలను తీసుకున్నారు. అడుగడుగునా ట్రంప్​ ను నిర్ణయాలను తప్పుగా చూపెట్టేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని తప్పుడు నిర్ణయాలను కూడా తీసుకున్నాడు. అవేంటో చూద్ధాం. 

పారిస్ వాతావరణ ఒప్పందంలో అమెరికా చేరిక.. 
జో బైడెన్​ అధ్యక్షుడుగా ఎన్నికైన తొలిరోజే పలు కీలక నిర్ణయాలపై సంతకం చేశారు. ఈ నిర్ణయాలలో ఒకటి అంతర్జాతీయ పారిస్ వాతావరణ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరడం. వాస్తవానికి, పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బైడెన్​ ట్రంప్​ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపడేశాడు. డోనాల్డ్​ ట్రంప్​ అధికారంలోకి వచ్చాక ఈ ఒప్పందం నుంచి అమెరికాను దూరం పెట్టాడు.

ముస్లిం దేశాలపై ఇమ్మిగ్రేషన్ నిషేధం తొలగింపు.. 
డొనాల్డ్ ట్రంప్ ముస్లిం దేశాలపై ఇమ్మిగ్రేషన్ నిషేధం విధించారు. దీంతో పలు దేశాలకు చెందిన వారికి వీసాల జారీని అమెరికా నిలిపివేసింది. జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ మార్చిన నిర్ణయాలలో ముస్లిం దేశాలపై ఇమ్మిగ్రేషన్ నిషేధాన్ని తొలగించడం కూడా ఒకటి. ట్రంప్ విధానం వల్ల ప్రభావితమైన దేశాలకు వీసా ప్రక్రియను పునఃప్రారంభించాలని ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. దీంతో ఈ దేశాల నుంచి అమెరికాకు ప్రయాణాలు ఎక్కువయ్యాయి. 

మెక్సికో సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటన ఉపసంహరణ..
ఈ నిర్ణయం కూడా ట్రంప్​ తీసుకున్నదే. కాగా జో బైడెన్​ మెక్సికో–యూఎస్​ సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. గోడను నిర్మించాలనే నిర్ణయాన్ని నిలిపివేశారు. దీంతో నిధులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. 

 జాత్యహంకారానికి వ్యతిరేకంగా కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం..
అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై కూడా జో బైడెన్​ సంతకం చేశారు. దీని కింద, జాత్యహంకారాన్ని అంతం చేయాలని ఫెడరల్ ఏజెన్సీలను కోరారు. అలాగే జాత్యహంకారాన్ని బలపరిచే ఇలాంటి విధానాలను సమీక్షించాలని కోరారు. అమెరికాలో అందరి వాణి వినిపిస్తామని ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తన ప్రసంగంలో కూడా చెప్పారు.

టీపీఎస్​ విస్తరణ.. 
జో బైడెన్ తన పదవీకాలం చివరి రోజుల్లో చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. వెనిజులా, ఎల్ సాల్వడార్, ఉక్రెయిన్, సూడాన్ నుంచి దాదాపు తొమ్మిది మిలియన్ల వలసదారుల కోసం తాత్కాలిక రక్షిత స్థితి (టీపీఎస్​) కార్యక్రమాన్ని విస్తరించాడు. అతని నిర్ణయం కారణంగా, సుమారు మిలియన్ల మంది వలస పౌరులు బహిష్కరణ నుంచి రక్షించబడ్డారు. దీంతో ఒక మిలియన్ వలసదారులకు 18 నెలల పాటు అమెరికాలో పని చేయడానికి అనుమతులను ఇచ్చినట్లయ్యింది.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనిక ఉపసంహరణ..
జో బైడెన్ విమర్శలకు దారితీసిన డెమోక్రటిక్ పార్టీ ఓటమికి కారణమైన కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ నిర్ణయాలలో మొదటిది ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ దళాల ఉపసంహరణ. ఈ నిర్ణయం అమెరికా విశ్వసనీయతను పూర్తిగా బలహీనపరిచింది. ఆఫ్ఘనిస్తాన్‌లో, అమెరికా తన చరిత్రలో సుదీర్ఘమైన యుద్ధం చేసింది. 2 ట్రిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

పుతిన్​ ను తక్కువ అంచనా వేయడం..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను జో బైడెన్​ తక్కువ అంచనా వేశారు. దీంతో ఈ సదవకాశాన్ని పుతిన్​ ఉపయోగించుకొని ఉక్రెయిన్​ పై విరుచుకుపడ్డాడు. దీంతో ఉక్రెయిన్​ కు సహాయం చేశాడు. దీంతో ఇరుదేశాల్లో మరింత ఉద్రిక్తతల పెరుగుదలకు కారణమైంది. రష్​యాపై అనేక ఆంక్షలను విధించారు. దీంతో ప్రపంచ ఆర్థిక స్థితి, ద్రవ్యోల్బణం, పలు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణంగా నిలిచాయి. దీంతో అమెరికాను వ్యతిరేకిస్తున్న దేశాలు సొంతంగానే తమ తమ కరెన్సీ ద్వారా లావాదేవీలు జరుపుకోవాలని నిర్ణయించి స్థానిక కరెన్సీ ద్వారానే వ్యాపారా లావాదేవీలను నిర్వహించడం ప్రారంభించాయి. దీంతో డాలర్​ ప్రాబల్యం భారీగా తగ్గింది. 

మధ్యప్రాచ్యం ఉద్రిక్తతలకు కారణం.. 
ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తర్వాత ప్రతీకారం తీర్చుకున్నందుకు హమాస్‌ను జవాబుదారీగా ఉంచడంలో జో బైడెన్​ పరిపాలన విఫలమైందనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్​ హమాస్​, గాజా, లెబనాన్​, పాలస్తీనాల దాడులపై రెండు నాల్కల ధోరణితో వ్యవహరించారు. జో బైడెన్​ చేసిన యుద్ధ విరమణ ప్రకటనలు, చర్యలు ఏ మాత్రం హమాస్​ లాంటి ఉగ్ర సంస్థలను భయపెట్టలేక పోయాయి. దీంతో యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

భారత్​ తో డబల్​ గేమ్​..
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంపై జో బైడెన్​ వైఖరి భారత్​– అమెరికా దేశాల మధ్య పలు అంతర్గత విబేధాలకు దారి తీసింది.  రష్యాతో సంబంధాల విషయంలో భారత్‌పై అమెరికా కఠిన ఆంక్షలు విధించాలని ప్రయత్నించింది. కెనడాలో నిజ్జర్​ హత్య కేసు, హిండెన్​ బర్గ్​ ఆరోపణలు లాంటి వాటితో జో బైడెన్​ పరిపాలనా యంత్రాంగం భారతదేశంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. కానీ ప్రధాని మోదీ నేతృత్వంలోని పటిష్ఠ విధానాలు, మంత్రివర్గం వీరి ప్రయత్నాలను పూర్తిగా తిప్పికొట్టి ధైర్యంగా ఎదురొడ్డి నిలవడంతో ఇక తప్పదనుకొని అమెరికా వెనక్కు తగ్గి భారత్​ తో స్నేహసంబంధాలను కొనసాగిస్తుంది.