వేగవంతమైన అభివృద్ధి దిశలో భారత్
India is in the direction of rapid development
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
‘ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025’ ప్రారంభం
నా తెలంగాణ న్యూ ఢిల్లీ: ప్రపంచంలో భారత్ అత్యంత వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తున్న దేశమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శురవారం న్యూ ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ‘ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025’ ప్రదర్శనలో పాల్గొని ప్రసంగించారు. ప్రదర్శనలో ఉన్న ఎలక్ర్టిక్ వాహనాలను పరిశీలించి వాటి గురించిన సమాచారాన్ని నిర్వాహకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆటోమోటివ్ పరిశ్రమ ప్రస్తుతం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. 12 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్నారు. భారత్ లో వేగంగా ఈవీ వాహనాల అమ్మకాల జోరు కొనసాగుతుందని తెలిపారు. చాలా దేశాలు అమ్మకాల్లో వెనుకబడి ఉన్నాయని తెలిపారు. మొబిలిటీ రంగం మరింత విస్తరణకు కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు. ఇంతకుముందు విశాలమైన రోడ్లు లేక ఈ రంగంలో కొనుగోళ్లు మందగించి ఉండేవన్నారు. ప్రస్తుతం జాతీయ రోడ్ల నెట్ వర్క్ ను భారీగా విస్తరించడంతో ఆటోమొబిలిటీ రంగం విస్తరణ, అభివృద్ధి సాధ్యపడుతున్నాయని మోదీ తెలిపారు.
రోడ్ల విస్తరణకు పెద్ద పీట..
గతేడాది మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 11 లక్షల కోట్లకు పైగా నిధులను కేటాయించామని తెలిపారు. దీంతో ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణాల ద్వారా రోడ్ నెట్ వర్క్ ను మరింత విస్తరించామని తెలిపారు. దేశ ప్రజలు మూడోసారి కూడా తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. మొబిలిటీ ఎక్స్ పో పరిధి గణనీయంగా పెరిగి 1.5 లక్షల మందికి పైగా సందర్శించారని తెలిపారు. ఎక్స్ పో కొనసాగనున్నన్ని రోజులు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త కొత్త వాహనాలను సంస్థలు ఇక్కడ లాంచ్ చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం నిర్ణయం మంచి భవిష్యత్ వైపు కొనసాగుతుందన్నారు. ఆకాంక్షలు, యువ శక్తి ఆశలు, ఆశయాలు, పనితనంతో భారత్ ఆటోమోటివ్ పరిశ్రమ రంగం విస్తరిస్తుందన్నారు. ఈ రంగంలో సత్ఫలితాలను సాధిస్తున్నామన్నారు.
అత్యాధునికతే లక్ష్యం..
గ్రీన్ టెక్నాలజీ, ఈవీలో, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనం, సారూప్య సాంకేతికతల అభివృద్ధితో కూడిన వాహనాలను ఈ ప్రదర్శనలో కొలువు తీరడం అభినందనీయమన్నారు. గతంలో 7సీ విజన్ పై కూడా తాను చర్చించానని తెలిపారు. మొబిలిటీ సొల్యూషన్‌లు సాధారణమైనవి, కనెక్ట్ చేయబడినవి, అనుకూలమైనవి, రద్దీ లేనివి, ఛార్జ్ చేయబడినవి, శుభ్రమైనవి, అత్యాధునికమైనవిగా ఉండాలన్నదే తమ ప్రధాన ఉద్దేశ్యమని ప్రధాని వివరించారు.
మేక్ ఇన్ ఇండియా చొరవకు ప్రధాని ప్రశంసలు..
ఆటో పరిశ్రమ పురోగతి, వృద్ధికి మేక్ ఇన్ ఇండియా చొరవను ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకం ద్వారా రూ. 2.25 లక్షల కోట్లకు పైగా విక్రయాలు సాధించి, 1.5 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను ఈ రంగంలో సృష్టించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమం 17వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు జరగనుంది. ఈ సమయంలో 9 సమావేశాలు, 20కిపైగా ప్రదర్శనలు ఉండనున్నాయి.