కవిత కస్టడీ పొడిగింపు

BRS leader K Kavitha’s ED custody extended

Mar 23, 2024 - 16:00
 0
కవిత కస్టడీ పొడిగింపు
  •  మరో మూడు రోజులపాటు విచారించనున్న ఈడీ
  •  విచారణకు సహకరించడం లేదని పిటిషన్​
  •  ఆమె మేనల్లుడి ఫోన్​ స్వాధీనం, అతను మిస్సింగ్​
  •  సమీర్​ మహేంద్ర కవిత బినామీగా గుర్తించిన ఈడీ
  •  హైదరాబాద్​ సహా మరికొన్ని చోట్ల సోదాలు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కోర్టు మరో మూడు రోజులపాటు ఈడీ కస్టడీకిచ్చింది. శనివారం మద్యం కుంభకోణం కేసుపై రౌస్​ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. మరో ఐదు రోజుల కస్టడీని కోరుతూ ఈడీ పిటిషన్​ దాఖలు చేసింది. విచారణలో కవిత తమకు సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలపై దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని కోర్టుకు తెలిపింది. మరో ఐదు రోజులపాటు కవితను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరింది. దీంతో ఈడీ పిటిషన్​ ​ను విచారించిన కోర్టు కవితను మరో మూడు రోజులపాటు ఈడీ కస్టడీకి ఇస్తూ తీర్పు చెప్పింది. 
ఫోన్​ డేటాపై విచారణ
ఈడీ తరపున న్యాయవాది జోయాబ్ హుసేన్ వాదనలు వినిపించారు. కవితను విచారించేందుకు మరో అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. నలుగురి వాంగ్మూలాలను కవితని అడిగామని.. కిక్ బ్యాగ్స్ గురించి కూడా అడిగినట్లు తెలిపారు. అయితే విచారణకు కవిత సహకరించడం లేదన్నారు. సమీర్ మహేంద్రతో కలిసి కవితను ప్రశ్నించాలని.. లిక్కర్​ స్కామ్‌లో కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్​ రూపంలో అందాయన్నారు. సౌత్ గ్రూప్‌నకు రూ.100 కోట్లు చేరాయని తెలిపారు. కవిత మొబైల్ డేటాను విశ్లేషించామని.. అయితే ఫోన్‌లోని డేటాను ముందే తొలగించారన్నారు. కవిత కుటుంబ సభ్యులు వివారాలు ఇవ్వడం లేదని తెలిపారు. కవిత మేనల్లుడి వ్యాపారానికి సంబంధించి వివరాలు అడిగామని.. తనకు తెలియదని కవిత సమాధానం ఇచ్చారన్నారు. సోదాల్లో కవిత మేనల్లుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని.. అప్పటి నుంచి మేనల్లుడు కనిపించడం లేదని ఈడీ తరపు న్యాయవాది వెల్లడించారు. మరికొన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కుటుంబ ఆదాయపు పన్ను, వ్యాపారాల వివరాలు అడిగామని.. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. రేఖా శరణ్‌కు సంబంధించి సమాచారం ఇవ్వడంలేదని చెప్పారు. సమీర్ మహేంద్ర కూడా కవిత బినామీ అని.. ఇప్పటికీ ఇంకా సోదాలు జరుగుతున్నాయని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అయితే ఈడీ కస్టడీలో ఉన్న కవితను బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఐటీ వివరాలు అడుగుతున్నారని.. కస్టడీలో ఉన్నప్పుడు కవిత డాక్యుమెంట్ వివరాలు ఎలా ఇస్తారని ఆమె తరఫు న్యాయవాది ప్రతివాదనలు వినిపించారు. కవిత తరపున బెయిల్ పిటిషన్ వేశామని.. బెయిల్ పిటిషన్‌పై ఈడీకి నోటీసులు ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే బెయిల్‌ పిటిషన్‌ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం బెయిల్‌ విచారణకు అర్హత లేదని ఈడీ పేర్కొంది.
హైదరాబాద్​ లో సోదాలు
లిక్కర్​ స్కామ్​ కేసులో కవిత బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో శనివారం ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఈమెతోపాటు కవితకు సన్నిహితులుగా మెలిగిన నాయకుల ఇళ్లపైనా దాడులకు ఈడీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు ఆమె మేనల్లుడి కోసం కూడా గాలిస్తున్నట్లు తెలుస్తున్నది.