అయోధ్య ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ కన్నుమూత
Ayodhya chief priest Satyendradas passed away

లక్నో: అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ (80) కన్నుమూశారు. బుధవారం ఉదయం లక్నోలోని పీజీఐలో మెదడు సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బాబ్రీ కూల్చివేత సమయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం కాకుండా తనతోపాటు తీసుకెళ్లారు. ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం లక్నోలోని సత్య ధామ్ గోపాల్ మందిర్ ఆశ్రమానికి తీసుకొచ్చారు. గత 32 సంవత్సరాలుగా సత్యేంద్ర దాస్ రామ జన్మభూమిలో ప్రధాన పూజారిగా పనిచేస్తున్నారు. 1945 మే 20న సత్యేంద్ర దాస్ యూపీలోని కబీర్ నగర్ జిల్లాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే అమితమైన భక్తి కారణంగా సాధువుగా మారారు. అయోధ్యకు వచ్చి అక్కడి సంస్కృత పాఠశాలలో విద్యనార్జించారు. అనంతరం ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే శ్రీరామ మందిరంలో సేవలు చేసేవారు. వృత్తితోపాటు శ్రీరామ సేవ నిర్వహణ బాధ్యతలు స్వీకరించే విధానంతో ప్రధాన ఆలయ పూజారికి ఆయన పేరును ఖరారు చేశారు. చివరిసారిగా రామ మందిర ప్రతిష్ఠాపన సమయంలో దాస్ మీడియాతో మాట్లాడుతూ.. తన భావాలను పంచుకున్నారు. ఎట్టకేలకు శ్రీరాముడి కుటీరం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితాశయం నెరవేరింది.
ప్రముఖుల నివాళులు..
సత్యేంద్ర దాస్ మృతి పట్ల రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సత్యేంద్ర దాస్ మృతిపట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి నివాళులు..
అయోధ్య ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ మరణం అత్యంత బాధకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన జీవితమంతా సనాతన ధర్మం, శ్రీరాముని సేవలో అంకితం చేశారని చెప్పారు. శ్రద్ధ, భక్తికి సత్యేంద్ర దాస్ నిదర్శనమన్నారు. రామజన్మభూమి ఆందోళనలో ఆయన కీలక భూమిక పోషించారని కొనియాడారు. భగవంతుడు శ్రీరాముడి పాదాల చెంత ఆయనకు చోటు లభిస్తుందని, శోకసమయంలో ఆయన అనుయాయులు, భక్తులకు మనోనిబ్బరాన్ని ప్రసాదించాలని భవంతున్ని ప్రార్థించారు.