నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో అనేకమంది మృత్యువాత పడుతుండగా, చాలామంది తీవ్ర గాయాలపాలవుతున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు అన్ని చర్యలు, అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రమాదాల నివారణలో మాత్రం విఫలమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని భావిస్తోంది. కేంద్రం ఐఐటీ విద్యార్థులతో కలిసి రోడ్డు ప్రమాదాలపై డేటాను రూపొందించనుంది. ఈ డేటా ద్వారా ఏయే ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి? కారణాలేంటీ? తదితర వివరాలను క్షుణ్ణంగా ఎంపికైన ఐఐటీ విద్యార్థులు అధ్యయనం చేయనున్నారు. అనంతరం ప్రమాదాలకు కారణాలైన బ్లాక్ స్పాట్, కారణాలను నివేదిక రూపంలో సమర్పించనున్నారు. ప్రమాదాల నివారణకు ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ నివేదికలో పొందుపరుస్తారు. ఈ నివేదికను నిపుణుల ద్వారా పర్యవేక్షించి సత్వరమే బ్లాక్ స్పాట్ ల సవరణను చేపట్టనున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
2018 నుంచి 2022 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మందికి గాయాలయ్యాయి.
2018లో 4,70,403 ప్రమాదాలు జరగ్గా, 1,57,593మంది మృత్యువాత పడ్డారు. 4,64,715 మందికి గాయాలయ్యాయి.
2019లో 4,56,959 ప్రమాదాలు జరగ్గా, 1,58,984మంది మృత్యువాత పడ్డారు. 4,49,360 మందికి గాయాలయ్యాయి.
2020లో 3,72,181 ప్రమాదాలు జరగ్గా, 1,38,383మంది మృత్యువాత పడ్డారు. 3,46,747 మందికి గాయాలయ్యాయి.
2021లో 4,12,432 ప్రమాదాలు జరగ్గా, 1,53,972మంది మృత్యువాత పడ్డారు. 3,84,448 మందికి గాయాలయ్యాయి.
2022లో 4,61,312 ప్రమాదాలు జరగ్గా, 1,68,491మంది మృత్యువాత పడ్డారు. 4,43,366 మందికి గాయాలయ్యాయి.
ఇవన్నీ మంత్రిత్వ శాఖ అందించిన వివరాల ప్రకారం మాత్రమే.