గ్రూప్ వన్ కు ఏర్పాట్లు పూర్తి
అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
నా తెలంగాణా, నిర్మల్: ఈ నెల 9న జరిగే గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణపై పరిశీలకులు, చీఫ్ సూపరిండెంట్లు, రూట్ అధికారులతో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫైజాన్ మాట్లాడుతూ టీజీపీఎస్సీ కమిషన్ నిబంధనలను అభ్యర్థులు, అధికారులు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పరీక్ష రాయబోయే అభ్యర్థులకు, విధులు నిర్వహించే సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. అభ్యర్థులంతా తమ హాల్ టికెట్ల పైన తాజా పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును తమ వెంట తెచ్చుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు, బూట్లు, సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదన్నారు. ఉదయం పది గంటలలోపు పరీక్ష కేంద్రాలలోకి చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమన్నారు. ఉదయం 10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్ష పత్రాలు, సామాగ్రి తరలింపు సమయంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రాంతీయ సమన్వయకర్త గంగారెడ్డి, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.