బీజేపీలోకి ఎంపీ సుమలత

అభివృద్ధికి కేంద్రం మద్దతు ప్రేమాభిమానాలు పంచిన మాండ్యను వదలను ఆత్మాభిమానం ఉంది.. హస్తంలో చేరను

Apr 3, 2024 - 18:00
 0
బీజేపీలోకి ఎంపీ సుమలత

బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం మాండ్య అభివృద్ధి కోసం రూ. 4వేల కోట్లు కేటాయించడాన్ని స్వాగతించిన మాండ్య ఎంపీ సుమలత తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఈ విషయాన్ని సుమలత తన మద్దతు దారులతో జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మాండ్య నుంచి ఎన్డీయే అభ్యర్థిగా బరిలో వున్న జేడీఎస్‌ నేత కుమారస్వామికి మద్దతు తెలిపారు. తనకు ప్రేమాభిమానాలు పంచిన మాండ్య ప్రజల మేలు మరువలేనని తెలిపారు. మాండ్య స్థానాన్ని విడవబోనన్నారు.  తన నియోజకవర్గంలో ఏదైనా నిర్ణయం తీసుకునేముందు తనను బీజేపీ నాయకులు సంప్రదిస్తున్నారని తన అభిప్రాయాలను తీసుకుంటున్నారని ఆ మేరకు నియోజకవర్గానికి లబ్ధి చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారన్నారు. ప్రజా సంక్షేమంపై నిరంతం ఆలోచిస్తున్న తనలాంటివారు బీజేపీ అవసరమని పేర్కొన్నారని తెలిపారు. దీంతో ఆయన మాటను కాదనలేకపోయానని తెలిపారు. ఆత్మాభిమానం ఉన్న నాయకురాలిగా కాంగ్రెస్​ పార్టీలో చేరబోనని సుమలత కుండబద్ధలు కొట్టారు. 

ఎంపీ ఎన్నికలంటే ఆషామాషీ విషయం కాదని తెలిపారు. ఒక మహిళ స్వతంత్ర ఎంపీగా పోటీచేసి గెలుపొందడమంటే కత్తిమీద సామేనన్నారు. అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మాండ్య ప్రజలు తనను ఆశీర్వదించి ఎంపీగా అవకాశం కల్పించడం మర్చిపోలేదని అన్నారు. గతేడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సుమలత బీజేపీకే మద్దతు ప్రకటించారు. అప్పుడు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగినా చేరలేదు. తాజా ప్రకటనతో సుమలత చేరిక ఖాయమైనట్లేనని కర్ణాటక బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.