నీటి సంరక్షణ దార్శనికత అంబేద్కర్ దే
Ambedkar's Vision of Water Conservation
మధ్యప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ
సెంట్రల్ కమీషన్ ఉన్నా రాష్ర్టాల్లో విభేదాలను సృష్టించారు
ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఖజురహోకు ప్రత్యేక స్థానం
రూ. 44,605 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
నెహ్రూ పేరు.. మిగతా వారిని మరుస్తారా?
భోపాల్: దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏనాడు కాంగ్రెస్ నీటి సంరక్షణ చర్యలను చేపట్టలేదని, అంబేద్కర్ లాంటి మహానీయుల విధానాలను విలువనీయలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ ఖజురహోలో రూ.44,605 కోట్ల అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు.కెన్ బెత్వా లింక్ ప్రాజెక్టు శంకుస్థాపన, ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన లఘు చిత్రాన్ని వీక్షించారు. వాజ్ పేయి తపాలా బిళ్ల, నాణేన్ని విడుదల చేశారు. అనంతరం బుందేల్ ఖండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ పథకాల క్రెడిట్ అంతా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కే దక్కుతుందన్నారు. నీటి సంరక్షణ కోసం ఆయన ఎప్పుడో చెప్పారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు ఆయన విధానాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
అటల్ వందవ జయంతి సందర్భంతా ఈ రోజు ప్రారంభించే పనులు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. అంబేద్కర్ పెద్ద నదుల నిర్మాణంలో దార్శనికతతో పలు సూచనలు, సలహాలు చేశారన్నారు. ఈనాడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఉన్నా వివాదాలను పరిష్కరించకుండా రాష్ర్టాలకు రాష్ర్టాలే కొట్టుకునేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. వారి చేతగానీ తనంతో భారత్ విచ్ఛిన్నానికి అనేక కుట్రలకు తెరతీశారని మోదీ మండిపడ్డారు. కేవలం నెహ్రూనే కాంగ్రెస్ పొగుడుతూ.. మిగతా వారంతా దేశానికి సేవలే చేయనట్లుగా ఈ పార్టీ వ్యవహరించిందన్నారు. వాస్తవానికి పెద్ద పెద్ద ప్రజా సంక్షేమ నిర్ణయాల్లో వారి పాత్ర ఏమీ లేదన్నారు. నీటి సంరక్షణలో అంబేద్కర్ దార్శనికతను అటకెక్కించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇంతకాలం ఆయనకు క్రెడిట్ దక్కనీయకుండా కుట్రలు పన్నుతూ ఇప్పుడూ ఎనలేని ప్రేమ ఒలకబోస్తుందని ప్రధాని మోదీ విమర్శించారు.
రాబోయే కాలంలో మధ్యప్రదేశ్ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించనుందని మోదీ చెప్పారు. బుందేల్ ఖండ్ పెద్ద పాత్రను పోషిస్తుందన్నారు. దేశాభివృద్ధిలో ఈ ప్రాంత పాత్ర ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ఎంపీ బౌద్ధ పర్యాటక కేంద్రంగా రూపొందుతుందన్నారు. గాంధీ సాగర్, ఓంకారేశ్వర్ డ్యామ్, ఇందిరా సాగర్ డ్యామ్, భేదాఘాట్, బాన్ సాగర్ డ్యామ్, ఖజురహో, గ్వాలియర్, ఓర్చా, చందేరి, మాండు వంటి ప్రదేశాలను హెరిటేజ్ సర్క్యూట్‌గా అనుసంధానిస్తామని మోదీ తెలిపారు. ఇప్పటికే పన్నా నేషనల్ పార్క్ ను అనుసంధానించామన్నారు. ప్రపంచంలోనే తొలి 10 పర్యాటక ప్రదేశాలలో మధ్యప్రదేశ్ ఒకటన్నారు. ఈ ప్రాజెక్టులతో రాష్ర్టానికి ఎంతో మేలు చేకూరనుందన్నారు. మధ్యప్రదేశ్ లో పర్యాటక రంగం అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.