భారత్లో ఎన్నికలు సైబర్ దాడులకు చైనా యత్నం
ఏఐ టెక్నాలజీతో కుయుక్తులకు సిద్ధం 2024లో 63 దేశాల ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం మైక్రోసాఫ్ట్ రహాస్య నివేదికలో స్పష్టం
న్యూఢిల్లీ: భారత్లో జరిగే ఎన్నికలపై ప్రభావం చూపేందుకు చైనా ప్రయత్నిస్తుందని టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఆ సంస్థకు చెందిన ఇంటెలిజెన్స్బృందం రహాస్య నివేదిక విడుదల చేసినట్లు మీడియా శనివారం స్పష్టం చేసింది. ఈ నివేదికలో పలు విస్తుగొలిపే అంశాలను పొందుపర్చింది. ఏఐ టెక్నాలజీ ద్వారా తైవాన్ ఎన్నికల్లో కూడా చైనా కుయుక్తులకు పాల్పడినట్లు వెల్లడించింది. భారత్తో ఇప్పటికే చైనా సరిహద్దు వివాదాలపై పేచీ నెలకొంది. ఈ నేపథ్యంలో చైనా ఎన్నికల్లో ప్రస్తుత భారత ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే ప్రమాదముందని హెచ్చరించింది. అంతేగాక ఓటర్లను తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. ఏఐ టెక్నాలజీ ద్వారా సోషల్ మీడియా మాధ్యమంగా ఇప్పటికే పలు బృందాలు రంగంలోకి దిగినట్లు మైక్రోసాఫ్ట్స్పష్టం చేసింది. చైనాకు మద్దతు పలుకుతున్న సైబర్ గ్రూపులు ఉత్తరకొరియాతోపాటు 2024లో ఎన్నికలు జరుగుతున్న అనేక దేశాలను లక్ష్యాలుగా చేసుకునే వ్యూహాన్ని ప్రయోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. 63 దేశాల్లో జరిగే ఎన్నికలపై చైనా సైబర్ గ్రూపులను ఉసిగొలిపే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 49 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్న నేపథ్యంలో అసత్యవార్తలు ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. ప్రస్తుతానికి ఏఐ టెక్నాలజీ ప్రభావం తక్కువగా అనిపిస్తున్నా భవిష్యత్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.