ముంబాయి: మహారాష్ట్ర ఎన్నికలలో మహా వికాస్ అఘాడీ సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. 288 అసెంబ్లీ స్థానాల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల మధ్య పేచీ నెలకొంది. మంగళవారం ఓ వైపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ నేతలు భేటీ కాగా, ముంబాయిలో మాతోశ్రీలో కాంగ్రెస్, శివసేన నాయకుల మధ్య వాడీవేడి చర్చలు జరిగాయి. ఈ భేటీలో ఇరువురు నాయకుల మధ్య బేధాభిప్రాయాలు సమసిపోనట్లుగా తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీ వరకూ తుది నిర్ణయం వెలువరిస్తామని పార్టీ నేతలు వెల్లడించారు.
ముంబాయి, నాసిక్, విదర్భలలో ఉన్న సీట్లపైనే ప్రధానంగా వివాదం నెలకొంది. కాంగ్రెస్ నానా పటోలే ఈ ప్రాంతాల్లో ఉన్న గెలిచే సీట్లను వదులుకోమని విబేధిస్తుండగా, అదే సమయంలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ ప్రాంతాల్లో తమ పార్టీకి బలముందని బలమైన అభ్యర్థులున్నారని విబేధిస్తున్నారు. దీంతో వివాదం కొలిక్కి రావడం లేదు. మరోవైపు ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదుర్చే బాధ్యత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు అప్పజెప్పారు. ఆయన సీనియార్టీకి ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ నాయకుడు బాలసాహెబ్ థోరట్ మంగళవారం ఆయన నివాసంలో మూడు గంటలపాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సీట్ల వివాదం కొలిక్కి రావచ్చని కాంగ్రెస్ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.
యూబిటీ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ 210 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. 96 కాంగ్రెస్ శివసేన 100, ఎన్సీపీ 88 స్థానాల్లో పోటీ చేయనున్నాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ మాత్రం 125 సీట్లను ఆశిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంకా చర్చలు కొలిక్కి రావడం లేదు. న్యూ ఢిల్లీ సమావేశంలో శివసేన తరఫున సంజయ్ రౌత్ కూడా ఉన్నారు.
ఈ మూడు పార్టీల కూటమిలో అత్యధికంగా సీట్లు పొందిన వారినే సీఎం పదవి వరిస్తుందనే ఆశలో సీట్లు ఎక్కువగా దక్కించుకునేందుకు ఇంకా ఉగిసలాటలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవేళ అత్యధికంగా సీట్లు దక్కించుకున్నా ప్రజాభిప్రాయం ఎవరి మొగ్గు చూపనుందనేదే మహాలో కీలకం కానుంది.