నకిలీ వైద్యుడిపై చర్యలు ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు
చేపట్టిన వైద్య బృందం చిన్న జబ్బులకూ ప్రమాదకరమైన యాంటీబయోటిక్స్ వినియోగం
నా తెలంగాణ, డోర్నకల్: మరిపెడలోని ప్రథమ చికిత్స కేంద్రాలపై మరోసారి జాతీయ, రాష్ర్ట వైద్యమండలి ఆదేశాల మేరకు మెడికల్ టాస్క్ ఫోర్స్ టీం సోమవారం దాడులు నిర్వహించింది. యాంటీబయోటిక్ మేరోపినం లాంటి మందులను తరచూ వాడుతుండడంపై మెడికల్ కౌన్సిల్ ఇటీవలే పలు హెచ్చరికలు కూడా జారీ చేసినా వినకపోవడంతో ఈ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. డా. వేములపల్లి నరేష్ కుమార్, డా. కొలిపాక వెంకటస్వామి బృందం తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో నకిలీ వైద్యుడు వీరస్వామిని అదుపులోకి తీసుకున్నారు. వీరస్వామికి ఎలాంటి వైద్య చికిత్స అర్హత లేకపోయినా ఉమాశంకర్ క్లినిక్ ను ఏర్పాటు చేసి వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లుగా ఈ బృందం గుర్తించింది. ఐసీయూల్లో వాడే మెరోపినం, పిపర్సిలీన్ టాజోబాక్టమ్ లాంటి వాటిని వాడుతున్నట్లు గుర్తించింది. చిన్నజబ్బులకు కూడా ఈ మందులను వాడితే రోగి ప్రాణం పోయే అవకాశం కూడా ఉందని డా. నరేష్ కుమార్ తెలిపారు. విశేషం ఏమిటంటే ఒకరోజు ముందు డీఎంహెచ్ వో తనిఖీలు నిర్వహించినా వీరస్వామి ఉల్లంఘనలు గుర్తించలేదు. అంతే జిల్లా వైద్యాధికారులు కూడా ఇతనికి వంతపాడుతున్నట్లు తెలుస్తోంది. వీరస్వామిపై ఎన్ఎంసీ చట్టం 34, 54 ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని వైద్య బృందం ప్రకటించింది.
పలువురు వైద్యులు తనిఖీలకు వస్తున్నామన్న విషయం ముందుగానే తెలుసుకొని వారి వద్ద ఉన్న మెడికల్ వేస్టేజ్ ను బయట వేసి తగులబెడుతున్నారని అన్నారు. దీంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందన్నారు. ఇలాంటి విషయాలపై కూడా దృష్టి సారించి వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తనిఖీకి వచ్చిన అధికారుల బృందం తెలిపింది.