ఉచితాలపై శ్వేతపత్రం అవసరం
దేశానికి లాభమా? నష్టమా? అన్నది ప్రజలకు వివరించి చెప్పాలి బలహీన వర్గాల ఆర్థిక భద్రతపై కట్టుబడి ఉండాలి 2047 వరకు నిరంతరం 7.6 వృద్ధిరేటును నమోదు చేయాలి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బరావు
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై శ్వేతపత్రం తీసుకురావాల్సిన అవసరం ఉందని మాజీ ఆర్ బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. ఆయా ఉచితాలపై అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏకాభిప్రాయం తీసుకొని శ్వేతపత్రం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే ఉచితాలపై రాజకీయ పార్టీలను కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఉచితాల వల్ల దేశానికి ఒరిగేదేం లేదన్నది ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. వారికి పూర్తి అవగాహన కల్పించే బాధ్యత రాజకీయ పార్టీలదే అన్నారు. ఉచితాలను అమలు చేయలేక ఆయా ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత హామీలు కాస్త తిరిగి ప్రజలపైనే భారం పడుతుందన్న విషయాన్ని వివరించి చెప్పే అవసరం ఉందన్నారు.
అదే సమయంలో బలహీన వర్గాలకు ఆర్థిక భద్రత చేపట్టే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కూడా దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఉచితాల వల్ల దేశానికి ఏం ఉపయోగమో ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ కొనసాగిస్తూనే ఎఫ్ ఆర్బీఎం లక్ష్యాలను అనుసరించాలన్నారు. ఐఎంఎఫ్ ప్రకారం భారత్ 2047 నాటికి నిరంతరంగా 7.6 వృద్ధి రేటును సాధించాల్సిన అవసరం ఉందని దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు.