ఒక డిఏ ప్రకటించడం విచారకరం
మెదక్ జిల్లా ఉద్యోగుల ఐకాసా చైర్మన్ దొంత నరేందర్
నా తెలంగాణ, మెదక్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రివర్గ సమావేశంలో ఒక విడత డిఏ మంజూరు చేయడం పట్ల ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారని జిల్లా ఉద్యోగుల ఐకాసా చైర్మన్ దొంత నరేందర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని మూడు విడతలు నూతన ప్రభుత్వం నందు పెండింగ్ లో ఉన్న రెండు డిఏల కోసం ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఎదురుచూస్తూ దీపావళి కానుకగానైనా కనీసం మూడు విడతల డిఏ మంజూరు అవుతుందన్న ఉద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందించడంలో ఉద్యోగులుగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అదే క్రమంలో ఉద్యోగులకు సహజంగా రావలసిన కరువు భత్యం ఇవ్వడంలో జాప్యం తగదన్నారు. తెలంగాణ ప్రజలలో భాగమైన ఉద్యోగులు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకుంటామని కానీ ఉద్యోగులకు న్యాయంగా రావలసిన ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయవద్దని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి కనీసం మరో విడత డిఏ మంజూరు చేసే విధంగా నిర్ణయం తీసుకొని ఉద్యోగుల మనోభావాలను గౌరవించాలని తెలిపారు. ఆయన వెంట టీఎన్జీవో జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్, సహ అధ్యక్షులు ఎండి ఇక్బాల్ పాషా, కోశాధికారి ఎం చంద్రశేఖర్లు ఉన్నారు.