యూఎన్ 9మంది బందీలుగా చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు
ఐక్యరాజ్య సమితికే సవాల్ విడవకుంటే తీవ్ర పరిణామాలు తప్పవన్న యూఎన్ సభ్యదేశాలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యెమెన్ హౌతీలు ఐక్యరాజ్యసమితికి సవాల్ విసిరారు. ఐక్యరాజ్యసమితి బృందానికి చెందిన 9మందిని, మరికొంతమందిని బందీలుగా చేసుకున్నారు. శుక్రవారం ఈ ఘటనకు పాల్పడ్డారు. దీంతో ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నారు. నౌకలపై దాడులు, ఉద్యోగులపై దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూఎన్ నేతృత్వంలోని అమెరికా, బ్రిటన్ దళాలు యెమెన్ లో హౌతీ తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు చేశాయి. ఈ దాడికి ప్రతిచర్య కోసం వీరు ఎదురు చూస్తున్నారు. శుక్రవారం అదను చూసుకొని ఐక్యరాజ్యసమితి బృందంపై దాడులకు పాల్పడి ఉద్యోగులను బందీలుగా చేసుకున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను కూడా వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తు సముద్ర మార్గంలో వస్తున్న ఇతర దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోతున్నారు. యూఎన్ అధికారులు ఈ ఘటనపై స్పందించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు. అరెస్టు అయిన వారిలో యూఎన్ బృందానికి చెందిన అధికారులు ఉన్నారని, ఒకరు మహిళా ఉద్యోగిని అని తెలిపారు. మిగతా వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. కాగా హౌతీ చర్యలపై అమెరికా, బ్రిటన్ దళాలతోపాటు ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాలుగా ఉన్న నాటూ దళాలు కూడా మండిపడుతున్నాయి. బందీలను వెంటనే సురక్షితంగా విడవకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.