అమెరికా దాడుల్లో 18 మంది హౌతీలు మృతి

ఇరాన్​ కు గట్టి హెచ్చరిక

Mar 16, 2025 - 12:57
 0
అమెరికా దాడుల్లో 18 మంది హౌతీలు మృతి

వాషింగ్టన్​: అమెరికా యెమెన్​ హౌతీలపై ఆదివారం తెల్లవారుజామున భారీ వైమానిక దాడులకు పాల్పడింది. హోడైడా, బేడా, మారిబ్​ ప్రావిన్సుల్లో జరిగిన ఈ దాడుల్లో 18 మంది మృతి చెందగా, 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ నష్టం వాటిల్లింది. కాగా ట్రంప్​ ఇటీవలే హౌతీలు, ఇరాన్​ కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టడంతో దాడులకు దిగినట్లు అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు మీడియాకు వివరించారు. మరిన్ని దాడులు జరుగుతాయన్నారు. హౌతీలపై దాడులు ఇరాన్​ కు కూడా భారీ హెచ్చరికలేనని చెప్పారు.  ఇరాన్​ ప్రత్యక్షంగా, పరోక్షంగా హౌతీలు చేస్తున్న దాడులకు కారణంగా నిలుస్తుంది. ఆ గ్రూపులకు భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సరఫరా చేస్తుంది. యెమెన్​ లో హౌతీ తిరుగుబాటుదారులు పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక సముద్ర మార్గాల్లో పలు నౌకలను దోచుకోవడంలో సిద్ధహస్తులు వీరి చర్యలపై పలుమార్లు ప్రపంచదేశాలు, ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కాగా దాడుల అనంతరం సముద్రమార్గంలో స్వేచ్ఛ వాణిజ్యాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని అమెరికా వదిలిపెట్టబోదని ప్రకటించింది. అమెరికా ప్రకటనకు ప్రతిస్పందనగా హౌతీ వైమానిక దాడులు తమను ఆపలేవని అమెరికాపై ఈ దాడులకు త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని డిప్యూటి చీఫ్​ నస్రుద్దీన్​ అమెర్​ హెచ్చరించారు. మరో హౌతీ ప్రతినిధి అబ్దుల్ సలాం ప్రకటన విడుదల చేస్తూ అంతర్జాతీయ జలమార్గాలకు హౌతీలు విఘాతం కలిగిస్తున్నారనేది పూర్తిగా తప్పుడు ఆలోచన అన్నారు. ట్రంప్​ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తూ తమపై దాడులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.