నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రైల్వే ముందస్తు టిక్కెట్ల బుకింగ్ ను 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. గురువారం రైల్వే బోర్డు డైరెక్టర్ సంజయ్ మనోచా మాట్లాడుతూ.. ఈ నిర్ణయం నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 వరకు ఏఆర్పీ (అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్) కింద 120రోజుల బుకింగ్ చేసిన అన్ని బుకింగ్ లు ప్రస్తుతం కొనసాగుతాయని, అలాగే టిక్కెట్లు రద్దు చేసుకోవాలనుకునే వారు కూడా రద్దు చేసుకోవచ్చని తెలిపారు. మధ్యాహ్నం నడిచే ఎక్స్ ప్రెస్ కొన్ని రైళ్లలో మాత్రం బుకింగ్ లలో ఎలాంటి మార్పులు ఉండబోవని అన్నారు.
ఇంతకుముందు సుదూర ప్రాంతాలు, పెళ్లిళ్లు పేరంటాలు, పండుగలు, పబ్బాలకు వెళ్లే వారు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వారు. ప్రస్తుతం 60 రోజులకు సమయం తగ్గడంతో రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ కు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో అడ్వాన్స్ బుకింగ్ రైల్వే శాఖ నిర్ణయంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.