మణిపూర్ లో ఎన్ కౌంటర్ 11 మంది ఉగ్రవాదులు హతం
11 terrorists killed in encounter in Manipur
ఐదుగురు కిడ్నాప్
ఉగ్ర కాల్పుల్లో ఒక జవాన్ పరిస్థితి విషమం, రైతు మృతి
పోలీస్ స్టేషన్, సహాయక శిబిరమే లక్ష్యంగా కుకీ ఉగ్రవాదుల ఘాతూకం
ఇంఫాల్: మణిపూర్ జిరిబామ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 11 మంది కుకీ ఉగ్రవాదులను అసోం రైఫిల్స్, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా జరిపిన ఎన్ కౌంటర్ లో హతమార్చారు. బోరోబెకెరాలోని జకురాడోర్ కరోంగ్ ప్రాంతంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ఎన్ కౌంటర్ జరిగింది. పోలీస్ స్టేషన్, సీఆర్పీఎఫ్ పోస్టులపై ఉగ్రవాదులు మూకుమ్మడిగా, వ్యూహాత్మకంగా దాడి చేశారు.
ఎదురుకాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసు స్టేషన్ కు సమీపంలోనే సహాయక శిబిరం ఉంది. ఈ శిబిరమే టార్గెట్ గా కుకీ ఉగ్రవాదులు ప్రణాళిక ప్రకారం సైనిక దుస్తుల్లో వచ్చి ఉన్నపళంగా కాల్పులకు తెగబడ్డారు.
గతంలో కూడా ఇలాంటి కాల్పులు చోటు చేసుకోవడంతో ఇక్కడ భద్రత పెంచారు. ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్ కౌంటర్ లో మృతిచెందిన ఉగ్రవాదుల మృతదేహాలను బోరోబెకెరా పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. పోలీస్ స్టేషన్, శిబిరంపై దాడిచేశాక ఉగ్రవాదులు స్థానికంగా ఉన్న ఇళ్ల వైపు పరిగెత్తి ఇళ్లకు నిప్పు పెట్టారు. ఎదురు జవాబిస్తున్న భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు.
ఉగ్రవాదులు ఐదుగురిని కిడ్నాప్ చేసినట్లుగా అధికర వర్గాలు ప్రకటించాయి. వీరంతా యైంగాంగ్‌పోక్పి శాంతిఖోంగ్‌బన్ ప్రాంతంలో పొలాల్లో పనిచేస్తున్న రైతులుగా పేర్కొంటున్నా కిడ్నాపైన వారి విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఈ కాల్పుల్లో ఓ రైతు కూడా మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు.
ఈ ఎన్ కౌంటర్ తో పోలీసులు, భద్రతా బలగాలు అలర్టయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా అదనపు బలగాలను మోహరించారు.