ఉపాధి కూలి 10 శాతం పెంపు
ఉపాధి కూలీల వేతనాలను 4 నుంచి 10 శాతం వరకు పెంచుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: ఉపాధి కూలీల వేతనాలను 4 నుంచి 10 శాతం వరకు పెంచుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) నిర్ణయం తీసుకుంది. దీంతో ఉపాధి కూలీలకు తీపికబురు అందినట్లయింది. చాలా రోజుల నుంచి ఉపాధి కూలీ పెంచాలనే డిమాండ్ ఉన్న నేపథ్యంతో కేంద్ర ప్రభుత్వం గురువారం పెంపు నిర్ణయాన్ని ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకం కింద అత్యధిక వేతనం రోజుకు రూ. 374గా అందనుంది. అత్యల్పంగా రూ. 234 గా నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ పథకం కింద వేతన సవరణను మార్చి 27న కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. 28న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నైపుణ్యం లేని కార్మికులు వారు నివసిస్తున్న గ్రామంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధిని కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల జీవనోపాధి భద్రతను పెంపొందించే లక్ష్యం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.