విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
లక్నో: యూపీలోని మీర్జాపూర్ లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారాణాసి ప్రయాగ్ రాజ్ హైవే కట్గా గ్రామానికి సమీపంలో వేగంగా వచ్చిన ట్రక్కు ట్రాక్టర్ ను ఢీకొట్టింది. దీంతో 10మంది కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కూలీలంతా వారణాసి మీర్జామురాద్ కు చెందినవారన్నారు.
ప్రధాని సంతాపం..
రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతులకు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక అధికార యంత్రాంగం బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని అన్నారు.
కేంద్రమంత్రి అనుప్రియా పటేల్..
యూపీ రోడ్డు ప్రమాదం తీవ్ర విచారకరమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.