జేఏఎల్ పై సైబర్ అటాక్
పలు గంటలపాటు విమాన సేవలకు అంతరాయం
టోక్యో: జపాన్ ఎయిర్‌లైన్స్ (జేఏఎల్)పై భారీ సైబర్ దాడి జరిగింది. దీంతో వందలాది విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు విమానాలు ఆలస్యంగా నడిచాయని జపాన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. గురువారం ఉదయం జపాన్ ఎయిర్ లైన్స్ నెట్‌వర్క్ పై సైబర్ దాడి జరిగిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. టిక్కెట్లు, విమాన సీట్లు తదితర వివరాలను ఆన్ లైన్ ద్వారా పంచుకునే డేటా కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ లైన్స్ అధికారులు సాంకేతిక నిపుణుల ద్వారా సమస్యను కొన్ని గంటల్లో పరిష్కరించారు. దీంతో ఎయిర్ లైన్స్ సేవలు యథాతథంగా నడిచాయి. కాగా ఈ సైబర్ దాడిలో ఎలాంటి వైరస్ గుర్తించలేదని, కస్టమర్ల డేటా లీక్ కాలేదని జేఏఎల్ తెలిపింది. జపాన్ కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలపై తరచూ సైబర్ అటాక్ లు ఆందోళన కలిగిస్తున్నాయి. 2023లో జపాన్ అంతరిక్ష సంస్థ, ఓడరేవులపై సైబర్ దాడులు జరిగాయి. దీంతో మూడురోజులపాటు పలు సేవలు నిలిచిపోయాయి.
కాగా క్రిస్మస్ పర్వదినానికి ముందు 24న అమెరికన్ ఎయిర్ లైన్స్ పై కూడా భారీ సైబర్ దాడి జరిగింది. దీంతో కొన్ని గంటలపాటు అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన అన్ని విమాన సేవలకు అంతరాయం కలిగింది. ఈ రెండు దాడులపై అమెరికా, జపాన్ సాంకేతిక నిపుణులు దర్యాప్తు ముమ్మరం చేశారు.