యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం 10మంది మృతి
ఆరుగురికి తీవ్ర గాయాలు
పాట్నా: యూపీలోని హర్దోయ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను డీసీఎం ఢీ కొట్టడంతో 10మంది మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం బిల్ గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్రా బిల్హౌర్ హైవేపై రోషన్ పూర్ గ్రామ సమీపంలో ఆటో, డీసీఎం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని హర్దోయ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) నీరజ్ కుమార్ జాదౌన్ తెలిపారు. టూవీలర్ ను తప్పించేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రిలో చికిత్సనందింప చేస్తున్నామని చెప్పారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు, మరొక పురుషుడు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనాలను సీజ్ చేశామన్నారు. ప్రమాద వివరాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.