కర్బన ఉద్గారాల తగ్గింపే లక్ష్యం
నాణ్యమైన ఇంధనాన్ని దేశంలో వినియోగిస్తూ కర్బన ఉద్గారాలను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని భారత్ ఆ దిశగా చర్యల్లో ముందు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
గోవా: నాణ్యమైన ఇంధనాన్ని దేశంలో వినియోగిస్తూ కర్బన ఉద్గారాలను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని భారత్ ఆ దిశగా చర్యల్లో ముందు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గోవా ఇండియా ఎనర్జీ వీక్–2024ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. సుస్థిర భవిష్యత్తుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ సదస్సును ప్రారంభించడం సంతోషకరమన్నారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన, చమురు, ఎల్పీజీ వినియోగదారుగా ప్రపంచంలో నిలిచిందన్నారు. ఆటోమొబైల్, రిఫైనరీ రంగాల్లో నాలుగో అతిపెద్ద దేశమన్నారు. దేశంలో రోజురోజుకు ఎలక్ర్టిక్ వాహనాల సంఖ్య పెరగడం శుభపరిణామమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇటీవల బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కోసం హామీ ఇచ్చిన 11 లక్షల కోట్ల రూపాయల గురించి ప్రధాని ప్రస్తావించారు. ఇందులో ఇంధన రంగం కేటాయింపులను వివరించారు.
స్టార్టప్‌లను ప్రోత్సహించడంతో వాటి శక్తిని ఏకీకృతం చేసేందుకు ఇండియా ఎనర్జీ వీక్ 2024లో ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తుందన్నారు. వివిధ దేశాల నుంచి దాదాపు 17 మంది ఇంధన మంత్రులు, 35,000 మంది సభికులు, 900 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఈ ఎనర్జీ వీక్ లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్, రష్యా, యూకె, యూఎస్ఏ ఇది ఆరు ప్రత్యేక దేశాల భాగస్వామ్యాన్ని కలిగి ఉండడం విశేషం. ఇంధన రంగంలో భారతీయ ఎంఎస్ఎంఇల ముందున్న వినూత్న పరిష్కారాలను ప్రదర్శించడానికి ప్రత్యేక 'మేక్ ఇన్ ఇండియా' కూడా నిర్వహిస్తున్నారు.