ఒక్కటిస్తాం..
ఇండికూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ కు ఆప్ ఝలక్ ల మీద ఝలక్లిస్తోంది.
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇండికూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ కు ఆప్ ఝలక్ ల మీద ఝలక్లిస్తోంది. ఢిల్లీలో సీట్ల వ్యవహారం త్వరగా తేల్చకుంటే కాంగ్రెస్ కు ఒక్కటంటే ఒక్కటే సీటు ఇస్తామని, తాము అభ్యర్థులను ప్రకటించేస్తామని పార్టీ నేత సందీప్ పాఠక్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కుండబద్ధలు కొట్టారు.ఢిల్లీ పార్లమెంట్ లో మొత్తం ఏడు సీట్లున్నాయి. ఆరింటిలో తాము పోటీలోకి దిగుతామని ఒక్కటి మాత్రం హస్తం పార్టీ పోటీ చేయొచ్చని పేర్కొంది. వీలైనంత త్వరలో నిర్ణయం చెప్పకుంటే ఆ స్థానంలో కూడా ఆప్ పార్టీ అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరించింది.
అయితే ఇటీవలే ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ పంజాబ్ తరన్ తరన్ జిల్లాలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. ఢిల్లీలో ఏడింటికి ఏడు పార్లమెంట్ స్థానాలను తాము కైవసం చేసుకుంటామని బహిరంగంగానే ప్రకటించారు. పంజాబ్ లోని 13 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంటుందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండి కూటమి ప్రధాన పార్టీ కాంగ్రెస్ తో కాకుండా సింగిల్ గానే పోటీలోకి అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను దింపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి,జేడీయూ, టీఎంసీలు టాటా చెప్పిన విషయం తెలిసిందే. ఇక మిగతా పార్టీలు ఆర్ జేడీ,ఎస్పీ, బీఎస్పీ, ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ సీట్ల వ్యవహారంపై తమకేమి పట్టనట్లుగా తమ అభ్యర్థులను ఆయా స్థానాల్లో నిలబెట్టే సన్నాహాల్లో ఉన్నాయి.