పర్యటకం, దేవాలయాల అభివృద్ధికి కేంద్రం కృషి

ములుగులో గిరిజన యూనివర్సిటీ త్వరలోనే ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం

Feb 14, 2024 - 16:19
 0
పర్యటకం, దేవాలయాల అభివృద్ధికి కేంద్రం కృషి

నా తెలంగాణ, వరంగల్: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాల కల్పిస్తున్నదని జి.కిషన్ ​రెడ్డి  అన్నారు.  పర్యటకం, చారిత్రక కట్టడాలు, దేవాలయాల ఆధునీకరణకు, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వరంగల్​ పర్యటన సందర్భంగా  మంగళవారం వేయి స్తంభాల గుడి మండపం ఆధునీకరణ పనులను మంత్రి కిషన్​ రెడ్డి పరిశీలించి మీడియాతో మాట్లాడారు. హన్మకొండలోని కాకతీయుల కాలంనాటి రుద్రేశ్వర స్వామి వారి వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. కొన్ని స్తంభాలు పూర్తిగా క్షీణదశలో ఉండగా, వాటిని పునర్నిర్మించారని తెలిపారు. రామప్ప దేవాలయ అభివృద్ధి, పర్యటకులకు వసతుల కోసం రూ.60 కోట్లు ఖర్చు చేశామని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి చెప్పారు. దేవాలయంలో ధ్వంసమైన భాగాలు ఆర్కియాలజీ సర్వే ఆఫ్​ ఇండియా ద్వారా నిర్మాణం చేపట్టామన్నారు. వరంగల్​ పోర్టుకు నూతన లైటింగ్​ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ములుగులో సమ్మక్క-సారలమ్మ గిరిజన యూనివర్సిటీ మంజూరు చేశామని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రారంభిస్తారన్నారు. విశ్వ విద్యాలయాన్ని తాత్కాలికంగా ప్రారంభించి ప్రస్తుత యేడాది కోర్సులను నిర్వహిస్తామని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి తెలిపారు. 
అధికారులకు సూచనలు
వేయి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భం ఆలయ అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ సందర్శన సందర్భంగా ప్రాంగణంలోని పరిసరాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులపై పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.