అధ్యక్షుడి ఎంపిక ఎప్పుడో?

When is the president elected?

Mar 7, 2025 - 13:29
 0
అధ్యక్షుడి ఎంపిక ఎప్పుడో?

రాష్ట్రాల అధ్యక్ష ఎన్నికలు, ఆర్​ఎస్​ఎస్​ సమావేశాలు
ఉగాది నూతన సంవత్సరానికి ఎంపికయ్యే అవకాశం

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: బీజేపీ (భారతీయ జనతా పార్టీ) జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. పార్టీవర్గాల ప్రకారం ఏప్రిల్​ లో నూతన అధ్యక్షుడి నియామకం జరగనుంది. అయితే ఎన్నిక వాయిదా పడేందుకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి. రాష్ర్టాల అధ్యక్ష ఎన్నికలు, ఆర్​ఎస్​ఎస్​ సమావేశాల కారణంగా ఆలస్యం అవుతుందనే వాదనలున్నాయి. కాగా తుది నిర్ణయం మార్చి 24న తీసుకోనున్నారని తెలుస్తున్నా, ప్రకటించేది మాత్రం ఏప్రిల్​ మాసంలోనే అని పార్టీ వర్గాల ద్వారా సమాచారం. 

ఆశావహులతో మంతనాలు..
ఇప్పటికే దేశంలోని పలు రాష్​ర్టాల్లో బీజేపీ అధ్యక్షుల నియామకాలు జరిగినా, మరికొన్ని రాష్​ర్టాల్లో అధ్యక్షుల రేసులో ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో అధిష్టానం ఆలోచనలో పడింది. సరైన అభ్యర్థిని ఎన్నుకుంటే పార్టీ మరింత బలోపేతం అవుతుందనే అభిప్రాయాలు, ఆలోచనల నేపథ్యంలో ఆశావహులతో మంతనాలు కొనసాగిస్తుంది. ఎక్కువ సంఖ్యలో అధ్యక్ష రేసులో ఉన్న రాష్ర్టాల్లో ఆశావహ అభ్యర్థులకు ఇతర స్థానాల్లో కీలక పదవులు దక్కేలా చర్యలు తీసుకుంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా రాష్​ర్టాల్లో అధ్యక్ష ఎన్నికల్లో జాప్యం ఏర్పడుతుంది. 

అడ్డంకుల తొలగింపు..
రెండో ప్రధాన కారణంగా ఆర్​ఎస్​ఎస్​ సమావేశాలు. మార్చి 21 నుంచి 23 వరకు బెంగళూరులో ఆర్​ఎస్​ఎస్​ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ వేదిక ద్వారా కూడా బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై ఆయా రాష్​ర్టాల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించి  ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. హోలీ, ఉగాది, ఏప్రిల్​ తొలివారంలో అని విభిన్న ప్రకటనలు వస్తున్నా బీజేపీ అధిష్టానం మాత్రం అంతర్గతం జాతీయాధ్యక్షుడి ఎన్నికపై ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వెళుతుంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపికకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 

మరో 10–15 రోజుల సమయం..
ఇప్పటికి 12 రాష్ర్టాలలో మాత్రమే బీజేపీ అధ్యక్ష ఎంపిక పూర్తయ్యింది. మిగతా రాష్ర్టాలలో పెండింగ్​ లో ఉంది. మరో అన్ని అధ్యక్ష స్థానాలను భర్తీ చేసేందుకు మరో 10–15 రోజులు పట్టే అవకాశం ఉంది. ఆర్​ఎస్​ఎస్​ సమావేశాల్లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంస్థ ప్రధాన కార్యదర్శి బిఎల్​ సంతోష్​ సహా 1500మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆర్​ఎస్​ఎస్​ దిగ్గజ నాయకులంతా మార్చి 17 నుంచి 24 వరకు బెంగళూరుకు చేరుకోనున్నారు. అధ్యక్షుడి నియామకంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. జాతీయాధ్యక్ష పదవిని ఉగాది హిందూ నూతన సంవత్సరం రోజునే ప్రకటిస్తే బాగుంటుందనే ఆలోచనలో కూడా బీజేపీ అధిష్ఠానం ఉంది. 

జేపీ నడ్డా..
2019లో కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్​ షా నియామకం కాగానే బీజేపీ జాతీయ తాత్కాలిక అధ్యక్షుడిగా జగత్​ ప్రకాష్​ నడ్డా ఎంపికయ్యారు. 2020 జనవరి 20న ఆరు నెలల తరువాత పూర్తి మద్దతుతో అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కాగా 2023లోనే ఆయన అధ్యక్ష పదవీ కాలం పూర్తి కావాల్సి ఉన్నా, 2024 ఎంపీ ఎన్నికల వరకు పొడిగించారు. ఎన్నికల అనంతరం నడ్డా కేబినెట్​ మంత్రి హోదా దక్కించుకున్నారు. ఆ వెంటనే మహారాష్ర్ట, హరియాణా, న్యూ ఢిల్లీ లాంటి ఎన్నికల నేపథ్యంలో నూతన అధ్యక్షుడి ఎంపికను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. పార్టీ ప్రకారం దేశంలోని సగం రాష్​ర్టాలలో బీజేపీ అధ్యక్షుల నియామకం జరిగాకే జాతీయ అధ్యక్ష ఎన్నిక జరగాలి. కాగా ఒకే వ్యక్తి రెండుసార్లు అధ్యక్ష పదవిని నిర్వహించే అవకాశం కూడా ఉంది. అయితే పార్టీలో అధ్యక్ష పదవికి పోటీ ఉన్న దృష్ట్యా అధిష్టానం నిర్ణయమే ఫైనల్​ కానుంది. 

అధ్యక్ష రేసులో ఎవరెవరంటే..
జేపీ నడ్డా (రెండోసారి) ఎంపికయ్య అవకాశం లేకపోలేదు. మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​, పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ లాంటి వారు తొలివరుసలో ఉన్నారు. రెండో వరుసలోనూ అనేక పేర్లు వినిపిస్తున్నా అధిష్టానం ఈ పేర్లపైనే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు వినిపిస్తుంది.