ఢిల్లీని ఏలేద్దామా? బీజేపీ, ఆప్​ టకాపార్​!

What about Delhi? BJP, AAP Takapar!

Jan 23, 2025 - 15:00
 0
ఢిల్లీని ఏలేద్దామా? బీజేపీ, ఆప్​ టకాపార్​!

ప్రచారంలో వెనకబడ్డ షీలా దీక్షిత్​ వారసత్వం
దూసుకెళుతున్న ప్రవేశ్​ వర్మ
అప్రతిష్ఠ మూటగట్టుకున్న కేజ్రీవాల్​
ఉచిత హామీలపైన గంపెడాశలు
వాల్మీకి, రజక, షెడ్యూల్​ ఓట్లపై ఆశలు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: దేశ రాజధాని న్యూ ఢిల్లీ మూడు పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నియోజకవర్గంగా కొనసాగుతుంది. ఇక్కడ గెలిస్తే ఢిల్లీని ఏలొచ్చనే అభిప్రాయాలున్నాయి. బీజేపీ, ఆప్​, కాంగ్రెస్​ పార్టీలు ఫిబ్రవరి 5న జరగనున్న ఎన్నికలకు పూర్తి సమాయత్తమై తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ప్రస్తుతం న్యూ ఢిల్లీ సీటుపైనే దేశవ్యాప్త దృష్టి కూడా ఉంది. ఈ స్థానం నుంచి బీజేపీ నుంచి ప్రవేశ్​ వర్మ, ఆప్​ నుంచి కేజ్రీవాల్​,కాంగ్రెస్​ నుంచి సందీప్​ దీక్షిత్​ లు రంగంలోకి దిగారు. మిగతా పార్టీలు, స్వాతంత్ర్యంగా మరో 20మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 23మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

బీజేపీ: బీజేపీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్​ సింగ్​ వర్మ కుమారుడు ప్రవేశ్​ వర్మను రంగంలోకి దించింది. ఈయన ఎన్నికల ప్రచారంలో మంచి ఊపును కనబరుస్తూ దూసుకుపోతున్నాడు. బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో వర్మకు ప్లస్​ పాయింట్​ కానుంది. మరోవైపు స్థానికంగా గత ఎన్నికల్లో బీజేపీకి 33 శాతం ఓట్లను కైవసం చేసుకుంది. దీంతో ఈసారి కమలానికి తిరుగులేదనే వాదనలు వినిపిస్తున్నాయి. 

ఆప్​: మాజీ సీఎం కేజ్రీవాల్​ కూడా ప్రచారంలో ముందువరుసలో ఉండగా, అవినీతి, షీష్​ మహాల్​, మద్యం కుంభకోణం, జైలు జీవితం లాంటివి ఈయనకు నష్టాన్ని చేకూరుస్తాయనే వాదన ఉంది. అదే సమయంలో భారీ ఎత్తున అమలుకు సాధ్యం కానీ హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలకు తెరతీశారు. ఈ హామీల అమలు సాధ్యం కాదని స్వయంగా ఓటర్లే చెబుతుండడం గమనార్హం. 

కాంగ్రెస్​: కాంగ్రెస్​ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్​ కుమారుడు సందీప్​ దీక్షిత్​ (60) ను ఈ స్థానం నుంచి పోటికి దింపింది. అయితే ఈయన వెంట తిరిగే కార్యకర్తల్లో, ప్రచార కర్తల్లో ఉత్సాహం ఉన్నప్పటికీ వయోభారం కారణంగా ఈయన ప్రచార శైలిలో జోరు కనిపించడం లేదు. ఏదో మొక్కుబడిగా ఓట్ల విచ్ఛిన్నానికే ప్రయత్నిస్తున్నట్లుగా కాంగ్రెస్​ ప్రచార శైలి కనిపిస్తుందని ఓటర్లు బహిరంగంగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకర్గం నుంచి కాంగ్రెస్​ గెలుపు అసాధ్యమేననే వాదనలు వినిపిస్తున్నాయి. 

చరిత్ర..
ఢిల్లీ గత మూడు దశాబ్ధాల చరిత్రను చూసుకుంటే ఈ స్థానంలో గెలిచిన పార్టీలో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1993లో బీజేపీకి చెందిన కీర్తి ఆజాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. షీలా దీక్షిత్ 1998లో ఈ స్థానంలో గెలిచారు. 2008 వరకు ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో కొత్తగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడి నుంచి షీలా దీక్షిత్‌ను ఓడించి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2015, 2020లోనూ కేజ్రీవాల్​ గెలిచి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే గత ఎన్నికల్లో కేజ్రీవాల్​ 61.1 శాతం, 2015 న్నికల్లో 64.3 శాతం 2013 ఎన్నికల్లో 53.46 శాతం ఓట్లు లభించాయి. ఈ ఓట్లలో ముఖ్యంగా వాల్మీకి 20వేల ఓట్లు, రజక 15 వేల ఓట్లు, షెడ్యూల్డ్​ కులాల ఓట్లు ఉన్నాయి. అయితే కేజ్రీవాల్​ కుంభకోణాలు, అవినీతిపై బీజేపీ విస్తృత ప్రచారంతో ఈసారి ఈ వర్గాలను ఆలోచనలో పడేశాయి. దీంతో ఓటింగ్​ శాతం భారీగా తగ్గి, బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీకి 33 శాతం ఓట్లు దక్కాయి. ఈసారి ఆప్​ లో చీలనున్న ఓట్లు నేరుగా బీజేపీలోకే మళ్లనున్నాయనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో  ఆప్​ కు మళ్లీ అధికారం దక్కడం కల్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 

అద్దాల మేడలు.. మురికివాడల ప్రజల తీర్పు ఎటువైపో?
ఈ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య దాదాపు 1,90,000. ఓ వైపు అద్దాల మేడలు, మరోవైపు మురికివాడలు, బడా రాజకీయ నాయకులు, కేంద్ర, రాష్ర్ట ఉన్నతాధికారులు, భద్రతాధికారుల ఇళ్లు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో గెలుపు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వాల్మీకి, రజక, షెడ్యూల్​ కులాల ఓట్లు అనుకున్నట్లుగానే బీజేపీ వైపు మళ్లితే ఇక ఆప్​ పని అంతేనని భావిస్తున్నారు.