అజ్ఞాతవాసం ముగిసింది కమలం వికసిస్తుంది: అమిత్ షా
Anonymity is over, lotus blooms: Amit Shah
పదేళ్లలో హామీలు ఎందుకు నెరవేర్చలేదు
అవినీతి కోటను నిర్మించుకొని మురికివాడలను విస్మరించారు
యమునాలో విషం, సంగంలో స్నానం ఇద్దరివీ మతిలేని వ్యాఖ్యలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బీజేపీ 26ఏళ్ల అజ్ఞాత వాసం ఇక ముగిసిందని త్వరలో దేశరాజధానిలో కమలం వికసిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కస్తూర్బానగర్ అసెంబ్లీ నియోజకవర్గం రోడ్ షోలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈసారి మార్పు ఖచ్చితమే అన్నారు. ఆప్ పదేళ్ల పాలన అందరికీ తెలిసిందే అన్నారు. ఈసారి మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ఓట్ల కోసం ఇప్పుడు ఇన్ని హామీలిచ్చే కేజ్రీవాల్ పదేళ్లలో చెప్పినవన్నీ ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. ప్రస్తుతం ఇచ్చే హామీలు కూడా నెరవేర్చే అవకాశం ఆయన వద్దే ఉన్నా ఎందుకు నెరవేర్చలేకపోయారని నిలదీశారు. పైగా కుంభకోణాలకు తెరతీస్తూ అవినీతి కోటను నిర్మించుకొని మురికివాడల ప్రజలను విస్మరించారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలాయన్నారు. నీతి నిజాయితీ అని చెప్పి రాజకీయాల్లోకి అడుగిడి నేడు వేల కోట్లకు పడగలెత్తారని విమర్శించారు. అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ మాత్రమే ఖచ్చితమైన చర్యలను తీసుకోగలదని షా స్పష్టం చేశారు. ఆప్ అబద్ధాలను ఇక ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. యమునాలో విషం, సంగంలో మునగ ఆప్, ఖర్గే వ్యాఖ్యలు మతిలేనివన్నారు. వీరు దేశ సంస్కృతి, సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేసేందుకే కంకణం కట్టుకున్నారని దేశ ప్రజలకు, రాష్ర్ట ప్రజలకు అర్థమైపోయిందన్నారు. ఈసారి ఢిల్లీలో ఆప్ పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని, బీజేపీ గెలుపు ఖాయమేనని అమిత్ షా పునరుద్ఘాటించారు.