డ్రగ్స్​ పై పోరాటం కొనసాగిస్తాం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా

Jan 11, 2025 - 13:53
 0
డ్రగ్స్​ పై పోరాటం కొనసాగిస్తాం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో డ్రగ్స్​ పై పోరాటం కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. ఈ పోరాటంలో కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు. భారత్​ ను డ్రగ్స్​ నుంచి విముక్తి చేసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తామన్నారు. ఈ మహామ్మారి వల్ల యువతపై, దేశ ప్రజలపై చెడు ప్రభావం పడుతుందని అమిత్​ షా అన్నారు. 

శనివారం డ్రగ్ ట్రాఫికింగ్, జాతీయ భద్రతపై ప్రాంతీయ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 2004 నుంచి 2014 వరకు 3.63లక్షల కిలోలు రూ. 8,150 కోట్ల విలువైన డ్రగ్స్​ ను స్వాధీనం చేసుకోగా, గత పదేళ్లలో 2014 నుంచి 2014 వరకు 24 లక్షల కిలోల రూ. 56,851 కోట్లవైన డ్రగ్స్​ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. డ్రగ్స్​ ఉపయోగం పెరుగుతుందని కొంతమంది ఆరోపిస్తున్నారని అన్నారు. డ్రగ్స్​ వినియోగం ముందునుంచి ఉన్నా కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఆ నెట్​ వర్క్​ ను నాశనం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున డ్రగ్స్​ వినియోగాన్ని అరికట్టగలుగుతున్నామని షా వివరించారు. అన్ని విభాగాలు డ్రగ్స్​ వినియోగాన్ని, స్మగ్లింగ్​ ను పూర్తిగా అరికట్టేందుకు అహార్నిశలు పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.

క్రిప్టోకరెన్సీ, ఆన్​ లైన్​ మోసాలు, డ్రోన్​ ల ఉపయోగాలు సవాళ్లు విసురుతున్నాయన్నారు. వీటిని కూడా సాంకేతికంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. దేశ ప్రజలు, యువత వీటిపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని అమిత్​ షా పునరుద్ఘాటించారు.