అక్రమ ఆయుధాలు అప్పగించాలి
మణిపూర్ ప్రధాన కార్యదర్శి పికె సింగ్

ఇంఫాల్: అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న, దోచుకున్న ఆయుధాలను ఏడు రోజుల్లోగా అప్పగించాలని మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె సింగ్ చెప్పారు. ఆదివారం ఆయన మణిపూర్ శాంతిభద్రతలకు తీసుకున్న చర్యలపై మీడియాకు వివరించారు. చట్టవిరుద్ధంగా ఆయుధాలున్నవారు వాటిని వెంటనే అప్పజెప్పాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో అందజేస్తే వారిపై ఎలాంటి చర్యలు ఉండబోవన్నారు. సమయం మించిపోయి భద్రతా దళాల ఆపరేషన్ లో ఆయుధాలు లభిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయుధాల ద్వారా మణిపూర్ శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం మణిపూర్ ప్రజల మనోభిప్రాయాలకు గౌరవం ఇస్తుందన్నారు. అదే సమయంలో విభిన్న రకాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే ఈ ప్రాంత అభివృద్ధి, శాంతి, సుస్థిరతలను కాపాడుతుందని పికె సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలన విధించాక మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కూడా అక్రమ ఆయుధాలను అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.