కొనసాగుతున్న చలితీవ్రత
Ongoing coldness

జమ్మూకశ్మీర్ లో –10 డిగ్రీలు
ఢిల్లీలో సున్నా విజిబిలిటీ
ఆలస్యంగా నడుస్తున్న విమానాలు, రైళ్లు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో 16 రాష్ట్రాల్లో చలితీవ్రత కొనసాగుతుంది. జమ్మూకశ్మీర్ లో – 10 డిగ్రీల సెల్సీయస్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం దేశవ్యాప్తంగా విజిబిలిటి సున్నాకు చేరుకోవడంతో పలు విమానాలు, రైళ్లు, ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఢిల్లీలో 45, యూపీలో 133 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. మధ్యప్రదేశ్ షాడోల్ లో 2.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్ లోని జైపూర్, అజ్మీర్ సహా 15 నగరాల్లో శనివారం వేకువజాము నుంచే భారీ వర్షం కురిసింది. హిమాచల్ టాబోలో మైనస్ 11 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. హరిద్వార్ లోనూ దట్టమైన పొగమంచు అలముకుంది. ఢిల్లీ, ఎన్ సీఆర్ ప్రాంతాల్లో 0 విజిబిలిటీ నమోదైంది. ప్రయాగ్ రాజ్ లో అత్యంత చలిగా ఉన్న భక్తులు త్రివేణి సంగమ స్నానాలు చేశారు. పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్ఛేరి, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం, కేరళకు కేంద్ర వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పలు దక్షిణాది రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, వర్షం పడొచ్చని హెచ్చరించింది. మరో రెండు, మూడు రోజులపాటు వాతావరణం ఇదే మాదిరిగా ఉంటుందని హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా చలితీవ్రత పెరుగుతుండడం రోజువారీ కార్యకలాపాలకు ఆటంకాలు సృష్టిస్తుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ చలిబారి నుంచి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు పలు సూచనలు, సలహాలు జారీ చేశారు.