విలువలతో కూడిన బంధాలు
మారిషస్ లో ప్రధాని మోదీ

జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు
క్లిష్టపరిస్థితుల్లోనూ ఒక్కటిగా నడిచాం
ప్రధాని నవీన్ చంద్రతో భేటీ
బలమైన భాగస్వామ్యానికి పునాది వేస్తాం
పోర్ట్ లూయిస్: భారత్–మారిషస్ మధ్య సాంస్కృతి సంప్రదాయాలు, విలువలతో కూడి ముడిపడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహాసముద్రంతోపాటు అనే ప్రాంతాలతో భారత్ కు ప్రత్యేక బంధం ఉందన్నారు. ఒకదేశం కోసం మరో దేశం ఎప్పుడూ సహాయకారిగా నిలిచిందని కొనియాడారు. ప్రకృతి వైపరీత్యాలు, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇరుదేశాలు ఒక్కటిగా ఉన్నాయని స్పష్టం చేశారు.
57వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..
మారిషస్ 57వ జాతీయ దినోత్సవం సందర్భంగా 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవంలో పాల్గొని అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ దేశాన్ని సందర్శించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వేడుకల్లో పాల్గొనడం తమ దేశ గౌరవాన్ని మరింత పెంచిందని మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం అన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న విశిష్ఠమైన, ప్రత్యేకమైన బంధాలకు నిదర్శనమని కొనియాడారు.
ఆయా రంగాల్లో సహకారం..
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజల మధ్య సంబంధాలు ఇరుదేశాల భాగస్వామ్యానికి బలమైన పునాదిని వేస్తాయన్నారు. డిజిటల్ హెల్త్, ఆయుష్ కేంద్రాలు, పాఠశాల విద్య, నైపుణ్యాల్లో సహకారం కొనసాగుతుందన్నారు. ఎఐ, డీపీఐ డిజిటల్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ ను ఉపయోగించడానికి ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయన్నారు. చార్ ధామ్ యాత్ర, రామాయణ ఇతిహాస స్థలాల సందర్శన కోసం ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మోదీ చెప్పారు.
ప్రధానితో భేటీ..
ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులంతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యం పెంచాలని నిర్ణయించారు. మారిషస్ లో నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో భారత్ సహకారం అందించనుంది. మెట్రో ఎక్స్ ప్రెస్ వే, సుప్రీంకోర్టు భవనం,గృహ నిర్మాణం, ఈఎన్ టీ ఆసుపత్రి, పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించాలని మోదీ నిర్ణయించారు. యూపీఐ, రూపేల ద్వారా చెల్లింపులను సరళతరం చేయనున్నారు. జనౌషధి కేంద్రాలు ఏర్పాటుకు నిర్ణయించారు.
అనంతరం ప్రధాని మోదీ మాజీ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్,
పోర్ట్ లూయిస్ మారిషస్ ప్రతిపక్ష నాయకుడు జార్జెస్ పీయరీ లెస్జోంగార్డ్ లతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ఈ చర్చల్లో ప్రధానితోపాటు విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్, ఎన్ఎస్ ఎ చీఫ్ అజిత్ ధోవల్ లు కూడా పాల్గొన్నారు.