చైనాకు ట్రంప్​ చెక్​

చైనాకు ట్రంప్​ చెక్​

Mar 14, 2025 - 14:10
 0
చైనాకు ట్రంప్​ చెక్​

రష్యా–భారత్​ తో దోస్తీ పటిష్ఠం
డ్రాగన్​ ఉత్పత్తి రంగం ప్రభావితం 

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: అమెరికాకు ముప్పుగా మారుతున్న చైనాకు చెక్​ పెట్టెందుకు డోనాల్డ్​ ట్రంప్​ మంత్రాంగం నడుపుతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. భారత్​, రష్యాపై పైపైకి సుంకాలనే ప్రకటనలు విధిస్తున్నప్పటికీ ఇప్పటికే ఆ దేశాలతో పలు అంశాల్లో రిబెట్లకు సంబంధించి కూడా చర్యలు తీసుకున్నట్లు వినిపిస్తుంది. ఈ చర్యలు భవిష్యత్​ లో చైనాను ఇరకాటంలోకి నెట్టనున్నాయి. ఒక నివేదిక ప్రకారం 2035 వరకు చైనా ఉత్పత్తి రంగంలో ప్రపంచంలోనే నెంబర్​ 1 దేశంగా నిలుస్తుంది. అయితే ఆ దేశ ఉత్పత్తులు గనుక ప్రపంచదేశాల్లో విజయవంతంగా ఎగుమతులు సాధిస్తే ఇటు ప్రపంచదేశాల్లో ఉత్పత్తి అవుతున్న వస్తువుల ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. అంతేగాక అమెరికా ఆర్థిక వ్యవస్థకు, పరిశ్రమ, సాంకేతిక రంగాలకు ఇది తీరని నష్టం వాటిల్లేలా చేస్తుంది. అందుకే ట్రంప్​ చైనాపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. 

పుతిన్​ తో మిత్రత్వం దేనికి సంకేతం..
మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ తో దగ్గరవడం వెనుక కూడా ఇదే కారణమని ఇంటలిజెన్స్​ నిపుణులు భావిస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే అమెరికా విధానాలకు అడుగడుగునా చైనా తప్పుపడుతూ దేనికైనా (యుద్ధానికి) రెఢీ అంటోంది. ఇదే అంశాన్ని ట్రంప్​ జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా అమెరికా కాదన్నా ఇటీవల చైనా బడ్జెట్​ లో రక్షణ రంగానికి భారీ కేటాయింపులు చేశారు. దీంతో భవిష్యత్​ లో ఈ అంశం అమెరికాకు చేటుతెచ్చి పెడుతుందనేది స్పష్టం అవుతుంది. మరోవైపు రష్​యా చైనా కంటే బలమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉన్నప్పటికీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ఆలోచిస్తుంది. ఇదే అంశం ట్రంప్​ కు కలిసి వచ్చింది. రష్యా–చైనా దోస్తీలను విడగొడితే రష్యా నుంచి అందే ముడిసరుకులు పూర్తిగా నిలిపివేసి చైనా ఉత్పత్తి రంగాన్ని ప్రభావితం చేయాలని ట్రంప్​ భావిస్తున్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్​ కూడా ఈ మధ్య ట్రంప్​ తో సుంకాలు విధించినా ఎక్కడా విబేధించే ప్రకటనలు చేయడం లేదు. అంతకుముందే వీరిద్దరి మధ్య పలు దఫాలు చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే భవిష్​యత్​ లో చైనా ఉత్పత్తి రంగం నెమ్మదించనుంది. 

చైనా కంటే భారత్​ కే రష్యా అధిక ప్రాధాన్యం..
మరోవైపు రష్యా–భారత్​ దోస్తీతో భారత్​ బలపడనుంది. రష్యా నుంచి చైనాకు అందుతున్న ముడిసరుకు ఇటు భారత్​ కు అందుతుంది. దీంతో భారత ఉత్పత్తి పరిశ్రమ పుంజుకునే అవకాశం ఉంది. అమెరికాకు భారత్​ తో వచ్చిన ముప్పు ఏమీ లేదని ట్రంప్​ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పైపైకి సుంకాల ప్రకటనలతో కలవరపరుస్తూ లోలోన మాత్రం మోదీతో బలమైన ద్వైపాక్షిక బంధాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇంకోవైపు భారత్​–చైనాల మధ్య సరిహద్దు వివాదాలు కూడా ఉండడంతో భారత్​ ఆచీతూచీ అడుగేస్తుంది. చైనా తన చుట్టుపక్కనున్న చిన్నదేశాల్లో  ప్రాబల్యం పెంచుకుంటూ సముద్రాల్లోనూ ఆధిపత్యం కొనసాగిస్తూ ఇలాగే కొనసాగితే ఇది అమెరికాకు తీవ్ర ముప్పును, విఘాతాన్ని కలిగించే అవకాశం ఉంది. 

ఈ నేపథ్యంలో చైనాను దెబ్బకొట్టాలంటే ఇటు భారత్​, అటు రష్యాలతో కలిసి నడవాలని ట్రంప్​ భావిస్తూ చైనా ప్రాబల్యాన్ని తగ్గించే చర్యలకు ఉపక్రమించినట్లు రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.