లోగో రూపొందించింది డీఎంకే పార్టీ నేత కుమారుడే!
The logo was designed by the son of a DMK party leader!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రూపాయి లోగో మార్పు వివాదం కొనసాగుతుంది. బీజేపీ నాయకురాలు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం ఎంకె. స్టాలిన్ నిర్ణయంపై మండిపడ్డారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. తమిళ భాషకే గాక దేశంలోని అన్ని భాషలకు సమప్రాధాన్యతను కల్పించినది మోదీ ప్రభుత్వమేనన్నారు.
కాగా రూపాయి లోగోను రూపొందించింది ఎంకె స్టాలిన్ డీఎంకే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎన్ ధర్మలింగం కుమారుడు ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ ధర్మలింగం కావడం విశేషం. లోగో రూపొందించడంపై మీడియాతో ఈయన కూడా మాట్లాడారు. తమిళనాడు ప్రభుత్వం చిహ్నాం మార్పు వెనుక గల కారణాలు తనకు తెలియదన్నాడు. మార్పునకు ప్రభుత్వం స్వంత పద్ధతులు, ఆలోచనలు, కారణాలు అయి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను రూపొందించిన రూపాయి లోగో వివాదానికి కేంద్రబిందువు కావడం దురదృష్టకరమన్నారు.
ఐఐటీ గుహవాటి ప్రొఫెసర్ అయిన ఉదయ్ కుమార్ ధర్మలింగం రూపాయి లోగో రూపకల్పనలో అనేక నియమ నిబంధనలు పాటించాడు. దేవనాగరి లిపిని అనుసరించాడు. దీంతోపాటు రోమన్ పెద్ద అక్షరం (R–ఆర్)ను ఉపయోగించాడు. వీటి రెండింటికి తోడు దేవనాగరి లిపికి ప్రత్యేకమైన క్షితిజ సమాంతర రేఖను మధ్యలో రూపొందించాడు. ఈ రేఖ త్రివర్ణ భారత జెండా ప్రేరణగా తీసుకున్నాడు. ఈ రూపాయి లోగో రూపకల్పనకు అనేకమంది పోటీ పడగా, ధర్మలింగం రూపొందించిన లోగోను కేంద్రం ఓకే చేసింది. ఇందుకు గాను ఉదయ్ కుమార్ ధర్మలింగానికి రూ. 2.50 లక్షల బహుమతి కూడా అందింది. 2010 జూలై 15 నుంచి నూతన లోగో చిహ్నాన్ని ఆమోదించారు.