దళితుల ఊచకోత కేసులో ముగ్గురికి ఉరిశిక్ష

44 ఏళ్ల తరువాత తీర్పు

Mar 18, 2025 - 18:35
 0
దళితుల ఊచకోత కేసులో ముగ్గురికి ఉరిశిక్ష

లక్నో: ఫిరోజాబాద్​ జస్రానా దిహులి దళితుల ఊచకోతలో 44 ఏళ్ల తరువాత ఏడీజే స్పెషల్​ కోర్టు ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధించింది. ఇద్దరు దోషులకు రూ. 2 లక్షల చొప్పున ఒక్కొక్కరికి జరిమానా, ఒక్కరికి రూ. 1 లక్ష జరిమానా విధించింది. తీర్పు అనంతరం ముగ్గురు నిందితులు కప్తాన్​ సింగ్​, రాంసేవక్​, రాంపాల్​ లను మెయిన్​ పురి జిల్లా జైలుకు తరలించారు. మంగళవారం ఈ ఊచకోత కేసుపై కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు అనంతరం 30 రోజుల్లోపు హైకోర్టులో అప్పీల్​ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. 

ఆ రోజు ఏం జరిగింది..

 ఫిరోజాబాద్ జిల్లాలోని జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని దిహులి గ్రామంలో (సంఘటన జరిగిన సమయంలో మెయిన్‌పురిలో భాగం) 24 మంది దళితులను ఊచకోత కోశారు. ఈ సంఘటన 1981 నవంబర్​ 18న సాయంత్రం 6 గంటలకు జరిగింది. ఒక కేసులో సాక్ష్యం చెప్పడాన్ని నిరసిస్తూ, ఆయుధాలతో దొంగలైన సంతోష్, రాధే ముఠా దిహులి గ్రామంలోకి ప్రవేశించి, మహిళలు, పురుషులు, పిల్లలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 24 మంది మరణించారు. హత్య చేసిన తర్వాత దుండగులు వారి వద్ద ఉన్న నగదు, బంగారాన్ని దోచుకున్నారు. ఈ ఫిర్యాదును దిహులికి చెందిన లాయక్ సింగ్ జస్రానా పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేశారు. రాధేశ్యామ్ అలియాస్ రాధే, సంతోష్ సింగ్ అలియాస్ సంతోష, మరో 20 మందిపై జస్రానా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు మెయిన్‌పురి నుంచి అలహాబాద్ కోర్టులో కొనసాగింది. దీని తర్వాత, కేసు మళ్లీ  2024 అక్టోబర్​ 19న విచారణ కోసం మెయిన్‌పురి సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారు. జిల్లా న్యాయమూర్తి ఆదేశాల మేరకు, ప్రత్యేక దోపిడీ కోర్టులో దీనిని విచారించారు. 20 మందిలో 13 మంది మరణించారు. నలుగురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు.