- కనెక్టివిటీ మెరుగుదల
- తమిళనాడుకు రూ. 6వేల కోట్లు
- కర్ణాటకకు రూ. 7వేల కోట్ల నిధుల కేటాయింపు
- 102 రైళ్ల ద్వారా 3కోట్ల మంది ప్రయాణించారు
- వందేభారత్ రైళ్ల ప్రారంభంలో ప్రధాని మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కనెక్టివిటీ మెరుగుదలతో వికసిత్ భారత్ లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందులో భాగంగానే చారిత్రక నగరాలను కలుపుతూ దేశమంతా వందేభారత్ ద్వారా రైళ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
శనివారం వర్చువల్ మాధ్యమంగా మూడు కొత్త వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. టెంపుల్ సిటీ మధురైని ఇకపై ఐటీ సిటీ బెంగళూరుతో అనుసంధానం చేస్తామన్నారు.
మీరట్-లక్నో, మధురై–బెంగళూరు, చెన్నై-నాగర్ కోయిల్ రైళ్లను ప్రారంభించారు. ఉత్తరాదిని దక్షిణాదితో జోడించే వికాస యాత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించామన్నారు.
వందేభారత్ లు నడుపుతున్న ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందన్నారు. దీని ద్వారా స్థానిక వ్యాపారాల్లో వృద్ధి నమోదవుతోందని మోదీ తెలిపారు. ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయన్నారు.
దక్షిణ భారతంలో ఎంతో ప్రతిభ, పాటవాలు, భూమి లభ్యత ఉందన్నారు. దక్షిణ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఈ యేడాది బడ్జెట్ లో తమిళనాడుకు రూ. 6వేల కోట్ల రైల్వే బడ్జెట్ ను కేటాయించామన్నారు. 2014తో పోల్చుకుంటే ఏడురెట్లు ఎక్కువగా నిధులు కేటాయించామన్నారు. తమిళనాడులో ఆరు రైళ్లు ఇప్పటికే నడుస్తున్నాయన్నారు. ప్రస్తుతం 8 వందే భారత్ రైళ్లు నడుస్తున్నట్లయిందన్నారు.
ఈ యేడాది కర్ణాటకకు రూ. 7వేల కోట్లు బడ్జెట్ కేటాయించామన్నారు. 2014తో పోల్చుకుంటే 9 రెట్లు పెరిగిందన్నారు. ప్రస్తుతం వందే భారత్ 8 జతలు కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నాయన్నారు. కర్ణాటక, తమిళనాడుతోపాటు దక్షిణ ప్రాంతాలన్నింటిలో రైల్వే సర్వీసులను మెరుగుపరిచామన్నారు. తాము కేటాయించిన నిధులతో రైల్వే ట్రాక్ లు, స్టేషన్ల ఆధునీకరణలు జరుగుతున్నాయన్నారు.
మీరట్ – లక్నో పశ్చిమ యూపీ ప్రాంతాల ప్రజలకు కూడా శుభ సందేశాన్ని అందించామన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. దీంతో లక్నో దూరాభారం కూడా తగ్గించగలిగామన్నారు. పీఎం గతి శక్తి విజన్ తో దేశ అభివృద్ధిని సాధిస్తుందన్నారు. హై స్పీడ్ రైళ్ల రాకతో వ్యాపార, వాణిజ్యాలలో పెరుగుదల నమోదవుతుందన్నారు. 102 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయన్నారు. 3 కోట్లమంది ఇప్పటివరకు ఈ రైళ్లలో ప్రయాణించారన్నారు.
వందేభారత్ ద్వారా 280కి పైగా జిల్లాలకు కనెక్టివిటీ మెరుగయ్యింది. మిలియన్ల మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు.