పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టిస్తున్న రాహుల్
ఆగ్రహం వ్యక్తం చేసిన పీయూష్ గోయల్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేలా రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకుడు పీయూష్ గోయల్ అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కౌంటర్ అటాక్ చేశారు. మార్కెట్లో సంపద రూ. 5 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయన్నారు. దీన్ని పట్టుకొని రాహుల్ గాంధీ విమర్శలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఆయా రాష్ర్టాల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ మహిళల ఖాతాల్లో లక్ష వేస్తామని చెప్పారు. ముందుగా ఆ వాగ్ధానం నెరవేర్చాలన్నారు. పెట్టుబడిదారులను రాహుల్ గాంధీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. విదేశీ పెట్టుబడులు తగ్గాయని, భారతీయుల పెట్టుబడులు పెరిగాయని తెలిపారు. యూపీఏ హయాంలో భారత్ మార్కెట్ విలువ రూ. 67 లక్షల కోట్లుగా ఉండేదన్నారు. ప్రస్తుతం పెట్టుబడులు రూ. 415 కోట్లని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు భారత మార్కెట్లు అత్యంత విశ్వసనీయంగా ఉన్నాయన్నారు. మోదీ హయాంలో నాలుగు రెట్లు పెరుగుదల చోటు చేసుకుందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.