పీఎంఎఫ్ బీవైకు తొమ్మిదేళ్లు
PMF is nine years old

రూ. 1.75 లక్షల కోట్లు చెల్లింపు
23.22 కోట్ల మంది రైతులు చేరిక
ప్రపంచంలోనే అత్యధిక రైతులు చేరిన పథకం
ఎక్కువమందికి బీమా కల్పిండమూ రికార్డే
పంట విధానాన్నే మారుస్తున్న పీఎంఎఫ్ బీవై, ఆర్ డబ్ల్యూబీసీఐఎస్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. 2016లో ప్రారంభించిన పీఎంఎఫ్ బీవై పథకం ద్వారా 2024 సంవత్సరం చివరి నాటికి రూ. 1.75 లక్షల కోట్ల క్లెయిమ్ లు చెల్లించగా, 23.22 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాలకు రైతులకు పూర్తి నష్టపరిహారం అందించే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని వ్యవసాయ, రైతు మంత్రిత్వ శాఖ ఈ పథకానికి రూపకల్పన చేసింది. 2022–23తో పోలిస్తే 2023–24లో ఈ పథకంలో 25 శాతం ఎక్కువ మంది రైతులు చేరారు. పీఎంఎఫ్ బీవై లో చేరుతున్న రైతుల సంఖ్యను గుర్తించిన కేంద్ర మంత్రివర్గం, రూ.69,515.71 కోట్ల బడ్జెట్‌తో వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (ఆర్ డబ్ల్యూబీసీఐఎస్)తో పాటు 2025–-26 వరకు కొనసాగింపును ఆమోదించింది. పీఎంఎఫ్ బీవై, ఆర్ డబ్ల్యూబీసీఐఎస్ లు పంట బీమా విధానాన్నే మార్చివేశాయి. దీంతో రైతులకు భారీ లబ్ధి చేకూరనుంది.
పీఎంఎఫ్ బీవై..
పీఎంఎఫ్ బీవై లో పంట విస్తీర్ణం అంచనా, దిగుబడి, వివాదాలు, నష్ట అంచనాలలో పారదర్శకత, ఖచ్చితత్వాన్ని పెంపొందిస్తారు. ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్‌లు, రిమోట్ సెన్సింగ్‌తో సహా అధునాతన సాంకేతికతను అనుసంధానించారు. ఖరీఫ్ 2023 నుంచి ఎస్ టెక్ (సాంకేతికత ఆధారంగా దిగుబడి అంచనా వ్యవస్థ) పరిచయం మరింత ఖచ్చితమైన దిగుబడి నష్ట అంచనాలకు, క్లెయిమ్ పరిష్కారాలను మెరుగుపరచడానికి సాంకేతికత ఆధారిత, మాన్యువల్ అంచనాలను రూపొందించారు.
పీఎంఎఫ్ బీవై ప్రయోజనాలు..
రైతులు ఖరీఫ్ పంటలకు రెండు శాతం, రబీ పంటలకు 1.5 శాతం, ఉద్యానవన, వాణిజ్య పంటలకు ఐదు శాతం, సరసమైన ప్రీమియం చెల్లిస్తున్నారు. మిగిలిన ప్రీమియానికి ప్రభుత్వమే సబ్సిడీ అందజేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ళు, వ్యాధులు, వడగళ్ళు, కొండచరియలు విరిగిపడటం వంటి స్థానిక విపత్తుల కారణంగా పంటకోత తర్వాత నష్టాలు వంటి విస్తృత శ్రేణి నష్టాలను కవర్ చేస్తుంది. సకాలంలో పరిహారం అందించడానికి, రైతులు ఋణ ఉచ్చులలో పడకుండా నిరోధించడానికి పంటకోత తర్వాత రెండు నెలల్లోపు క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసి రైతులకు నష్టపరిహారం అందజేస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా పంట వేసుకునేందుకు అవకాశం లేని రైతులకు కూడా ఈ పథకం ద్వారా 25 శాతం పరిహారం అందిస్తున్నారు.
పీఎంఎఫ్ బీవై బలోపేతం..
పీఎంఎఫ్ బీవై బలోపేతం చేసేందుకు ఏటా ఈ పథకంలో అధికారులు పలు మార్పు చేర్పులను చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు నేరుగా లబ్ధి పొందే ఆటంకాలు, లోసుగులు, సమస్యలను తొలగిస్తున్నారు. దీంతో 2023–24 వరకు రికార్డు స్థాయిలో ఈ పథకంలో రైతులు చేరారు. దీంతో ప్రపంచంలోనే పీఎంఎఫ్ బీవైలో చేరిన రైతుల సంఖ్య, అతిపెద్ద బీమాగా నిలుస్తుంది. కొన్ని రాష్ర్టాలు తమ వాటాను మాఫీ చేయడం ద్వారా రైతులకు ప్రీమియం భారం మరింత తగ్గుతుంది.