కుంభమేళాలో ప్రమాదాన్ని నివారించిన రెస్క్యూ బృందాలు

Rescue teams averted an accident at Kumbh Mela

Jan 19, 2025 - 19:01
Jan 19, 2025 - 19:02
 0
కుంభమేళాలో ప్రమాదాన్ని నివారించిన రెస్క్యూ బృందాలు

ఘటనా స్థలిని పరిశీలించిన సీఎం యోగి
ప్రమాదంపై యోగికి ప్రధాని ఫోన్​ వివరాలపై ఆరా

లక్నో: మహాకుంభమేళాలో అగ్నిప్రమాదాన్ని రెస్క్యూ, ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు ఒక గంటలోనే అదుపులోకి తీసుకువచ్చాయి. ఆదివారం ఓ టెంట్​ లో సిలీండర్​ పేలుడు వల్ల అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 50 టెంట్లు కాలిపోయాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన చుట్టుపక్కల ప్రాంతాల వారిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించి 16 ఫైరింజన్ల సహాయంతో మంటలను గంటలోనే అదుపులోకి తీసుకురాగలిగారు. 

ప్రమాద విషయంపై సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఆరా తీసి వెంటనే ఆ ప్రాంతాన్ని హెలికాప్టర్​ ద్వారా సందర్శించారు. సోమవారం ఉదయం కల్లా ఆ ప్రాంతాన్ని యథాతథంగా రూపొందించాలన్నారు. ప్రమాదాన్ని నివారించిన అధికారులను, సిబ్బందిని అభినందించారు. అధికారులతో ప్రమాదానికి కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. గీతా ప్రెస్​ క్యాంపులో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆరు సిలీండర్లు పేలిపోయాయని అధికారులు తెలిపారు. ప్రాణనష్టం జరగలేదని 50 టెంట్లు అగ్నిప్రమాదానికి ఆహుతయ్యాయని, ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపు చేశామని సీఎంకు వివరించారు. 

ప్రధాని మోదీ ఆరా..
కాగా అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ సీఎం యోగికి ఫోన్​ చేశారు. ప్రమాద విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. భక్తుల క్షేమానికి అధిక ప్రాధాన్యతనీయాలని సీఎం యోగికి సూచించారు. ప్రధానితో మాట్లాడిన అనంతరం యోగి ఘటనా స్థలికి చేరుకొని ప్రాంతాన్ని పరిశీలించారు.