యువతకు భరోసా

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ

Jan 31, 2025 - 16:59
Jan 31, 2025 - 16:59
 0
యువతకు భరోసా

బీజేపీ అధికారంలోకి రావాలని యశోభూమి కోరుకుంటుంది
స్వార్ట్​ సిటీగా రూపు దిద్దుతాం
అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకోవడం లేదు
కాగ్​ నివేదికతో బట్టబయలైన అవినీతి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: శ్రీకృష్ణుడి నగరం ద్వారక యశోభూమి ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటోందని, దీంతో కోట్లాది మంది యువత భవితకు భరోసా కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీకి విపత్తుగా మారిన ఆప్​ ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అఖండ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ప్రధాని మోదీ భరోసానిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 

డబుల్​ ఇంజన్​ ప్రభుత్వం అవసరం..
రాబోయే సమయంలో ఈ ప్రాంతమంతా స్మార్ట్​ సిటీగా రూపుదిద్దుతామని స్పష్టం చేశారు. దేశ విదేశాల నుంచి కూడా వందనా పార్కును చూసేందుకు పర్యాటకులు వస్తారని పేర్కొన్నారు. ఢిల్లీలోని నగరమే గాకుండా గ్రామీణ ప్రాంతాలను కూడా ఆదర్శవంతంగా రూపుదిద్దేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే డబుల్​ ఇంజన్​ ప్రభుత్వం అత్యంత అవసరమని చెప్పారు. ఢిల్లీలో ఎన్నో ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చారని, ఈసారి బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి చూడాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిలో ఏ రాయిని వదలిపెట్టబోమన్నారు. 

గతంలోని హామీలే నెరవేర్చలేదు..
గత పదకొండేళ్లుగా ఆపదా ప్రభుత్వం ఇచ్చిన హామీలనే నెరవేర్చలేదని, ప్రస్తుతం ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు? కేంద్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజల కోసం పథకాలను ప్రకటిస్తే వాటినీ తిరస్కరిస్తూ, ప్రభుత్వం అనుమతించడం లేదన్నారు. దీంతో ఢిల్లీలోని ప్రజలు అన్ని కేంద్ర పథకాలకు దూరం అవుతున్నారని చెప్పారు. అసత్యాలు, అవినీతి, దోపిడీలతో ఢిల్లీని ఏటీఎంగా మార్చుకున్నారని, ప్రజల సొమ్ము పిండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే సమయం ఆసన్నం కాగానే ప్రజల జేబులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. వీలైనంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు. 

ఆప్​ పై ప్రజల ద్వేషాన్ని చూస్తున్నా..
కాగ్​ నివేదికలోనూ వీరి అవినీతి చిట్టాను వెల్లడించారని ప్రధాని మోదీ చెప్పారు. దీంతో ఆప్​ ప్రభుత్వ అవినీతి బట్టబయలైందన్నారు. ఢిల్లీ వాసులు వీరి అవినీతికి వ్యతిరేకంగా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని ఈ ప్రభుత్వం పట్ల ప్రజల ద్వేషాన్ని చూస్తున్నానని తెలిపారు. వీరికి ఇక మూడిందన్నారు. విపత్తు సమయాల్లోనూ అవినీతికి పాల్పడటం సిగ్గు చేటన్నారు. ఓట్ల కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారని అన్నారు. యమునా పవిత్ర నదిపై వీరి వ్యాఖ్యలు రాజకీయ దుర్నీతికి నిదర్శణమన్నారు. తమ ప్రభుత్వం రాగానే యమునా నదికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఆధునిక రివర్​ ఫ్రంట్​ ను ఏర్పాటు చేసి, కారిడార్​ ను సృష్టిస్తామన్నారు. ఢిల్లీకి ప్రపంచ వ్యాప్త గుర్తింపు స్థాయిని తీసుకురావాలంటే అది కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.